యువత మైండ్‌ సెట్‌లో మార్పు వస్తోంది

యువత మైండ్‌ సెట్‌లో మార్పు వస్తోంది

క్రీడల పట్ల యువతలో ఆసక్తి పెరుగుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పల్లెలు, పట్టణాల్లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఖాళీగా ఉండకూడదని, యువతలో ఈ ఉత్సాహం కొనసాగాలని అన్నారు. తన రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 80వ ఎడిషన్ లో ప్రధాని మోడీ ఆదివారం మాట్లాడారు. ‘‘ఇవాళ మేజర్ ధ్యాన్‌ చంద్ జయంతి, ప్రపంచానికి ఇండియన్ హాకీ సత్తా చాటిన స్టార్ ఆయన. ఈ రోజు ఆయన జయంతిని పురస్కరించుకుని మనం నేషనల్స్ స్పోర్ట్స్‌ డే జరుపుకొంటున్నాం. ఒలింపిక్స్‌లో వచ్చిన ప్రతి మెడల్ కూడా ప్రత్యేకమే. టోక్యో ఒలింపిక్స్‌లో మన హాకీ టీమ్‌ మెడల్ సాధించడాన్ని యావత్‌ దేశం సెలబ్రేట్ చేసుకుంది. ఇది చూసి ధ్యాన్‌ చంద్‌ పై లోకాల్లో ఎంతో సంతోషించి ఉంటారు. దేశంలో ఇప్పుడు యువత మైండ్ సెట్ మారతోంది. ఏదైనా కొత్తగా సాధించాలన్న కలలు కంటున్నారు. స్పోర్ట్స్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటలు చూడడమే కాదు... వాటిలో గొప్పగా సాధించి చూపిస్తామన్న పట్టుదల కనిపిస్తోంది. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి. దేశంలోని పల్లెలు, పట్టణాల్లోని ప్లే గ్రౌండ్స్‌ ఖాళీగా ఉండకూడదు” అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీ స్వచ్ఛతలో నెంబర్ వన్ గా కొనసాగుతోందని ప్రధాని మోడీ చెప్పారు. సిటీని వాటర్ ప్లస్ గా మార్చాలని అక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కరోనా నేపథ్యంలో దేశ ప్రజలంతా స్వచ్ఛ భారత్‌ మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా వ్యాప్తి విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 62 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు వేశారన్నారు.