తెలంగాణను నిండా ముంచేందుకు ‘మెఘా‘ కుట్ర

తెలంగాణను నిండా ముంచేందుకు ‘మెఘా‘ కుట్ర
  • సంగమేశ్వరం లిఫ్ట్​ పనుల స్పీడ్​ పెంచిన కంపెనీ
  • కృష్ణానదినే మళ్లించేసే ప్రయత్నం
  • తెలంగాణ రైతుల ప్రయోజనాలకు దెబ్బ
  • కదలని టీఆర్ఎస్ సర్కారు..

తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు..మన రాష్ట్రంలో భారీ కాంట్రాక్టులన్నీ దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ.. తెలంగాణ ప్రయోజనాలకే ముప్పు తెస్తోంది. కృష్ణా నీళ్లు మనకు రాకుండా ఏపీ చేస్తున్న నీళ్ల దోపిడీలో భాగస్వామి అయ్యింది. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి కృష్ణా నీళ్లను రాయలసీమకు మళ్లించే కాంట్రాక్టును చేపట్టింది. అనుమతుల్లేని సంగమేశ్వరం లిఫ్ట్ పనులను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక సాగునీటి ప్రాజెక్టులను దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ ఆడుతున్న డబుల్ గేమ్.. తెలంగాణకు అంతులేని నష్టం తెచ్చిపెడుతోంది. ఇప్పటికే రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ధారపోసిన డబ్బులన్నీ ఈ కంపెనీ ఖాతాలోనే జమయ్యాయి. అది చాలదన్నట్లు కొత్తగా కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో
ఇంకో రూ.20 వేల కోట్లకు ఎసరు పెట్టింది.

హైదరాబాద్‌, వెలుగు:తెలంగాణకు మేఘా కంపెనీ వెన్నుపోటు పొడుస్తోంది. కృష్ణా నదికి గండి కొడుతోంది. ఎట్లాంటి అనుమతులు లేకున్నా.. సంగమేశ్వరం వద్ద లిఫ్టు పనులను శరవేగంగా చేస్తోంది. నదికి అడ్డంగా మట్టి పోసి నీళ్లను మళ్లిస్తోంది. పెద్ద పెద్ద మెషీన్లను తరలించి గుట్టుచప్పుడు కాకుండా మట్టి పనులను సాగిస్తోంది. ఉద్యమ సమయంలో పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే నిప్పులు కక్కుతూ ఆందోళనకు దిగిన టీఆర్​ఎస్​ లీడర్లు ఇప్పుడు అంతకు నాలుగు రెట్లు నీళ్లకు గండి కొడుతుంటే స్పందించకపోవడం, కాంట్రాక్టర్లకు మోకరిల్లినట్టుగా వ్యవహరించడం విస్మయపరుస్తోంది. ప్రతిపక్షాలు కూడా దీన్ని పట్టించుకోకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చుక్క నీళ్లు రాకుండా..

శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్​లోని సంగమేశ్వరం దగ్గర కృష్ణానది నీళ్లన్నీ మళ్లించుకునేలా ఏపీ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను రెండింతలు పెంచేందుకు ఏర్పాట్లు చేసింది.దీనితోపాటు రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసుకునేలా లిఫ్ట్​ను కడ్తోంది. శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌లోకి చేరే ప్రతి చుక్క నీటిని రాయలసీమకు మళ్లించుకునేలా ప్లాన్​ చేసిన ఈ ప్రాజెక్టు పనులను.. మేఘా ఇంజనీరింగ్  జాయింట్ వెంచరే దక్కించుకుంది. పనులు కూడా మొదలుపెట్టింది. ఎన్విరాన్​మెంట్​ క్లియరెన్స్​ సహా అన్ని పర్మిషన్లు వచ్చాకే నిర్మాణం చేపట్టాలని ఎన్జీటీ ఆదేశాలు ఉన్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా సంగమేశ్వరం పంపుహౌస్‌‌‌‌ పనులు స్పీడప్​ చేసింది. తెలంగాణ ప్రజల సొమ్మును దిగమింగే కాళేశ్వరం పనులను ఎంత వేగంగా చేస్తోందో… దక్షిణ తెలంగాణను ఏడారి చేసే రాయలసీమ లిఫ్ట్‌‌‌‌ పనులను కూడా అంతే వేగంతో కొనసాగిస్తోంది.

రైతులే పోరాడుతున్నరు..

ఏపీ అక్రమ ప్రాజెక్టు కారణంగా నష్టపోతున్న మన రాష్ట్ర రైతులే.. గ్రీన్​ ట్రిబ్యునల్​లో, కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏపీ ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి లెటర్ రాశానని సీఎం కేసీఆర్ చెప్తున్నారేగానీ.. మన రాష్ట్ర నిధులతో ఎదిగిన మేఘా కంపెనీ మన ప్రయోజనాలను దెబ్బతీసేలా పొరుగు రాష్ట్రంలో పనులు చేస్తుంటే మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. సగం రాష్ట్రం ఎడారిగా మారే ముప్పున్న ఇంత పెద్ద సమస్యపై ప్రతిపక్షాలు కూడా మౌనంగానే ఉంటున్నాయి. సాగునీటికి రానున్న ముప్పుపై లీడర్లకు సరైన అవగాహన లేకపోవడం, కాంట్రాక్టర్లతో సొంత ప్రయోజనాలు ఉండటం వంటివాటితో ప్రతిపక్ష నేతలు మాట్లాడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే మేఘా కంపెనీ ఎట్లాంటి బెరుకు లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేసుకుపోతోంది. తెలంగాణ ప్రజల డబ్బుతో ఎదుగుతూనే తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే పనులు చేస్తోంది.

32 లక్షల ఎకరాలు ఎండిపోతయ్..

సంగమేశ్వరం లిఫ్ట్‌ పూర్తయితే.. శ్రీశైలం రిజర్వాయర్​కు వచ్చే నీళ్లన్నింటినీ ఎగువ నుంచే రాయలసీమకు మళ్లిస్తారు. భారీ వరదలు వస్తే తప్ప శ్రీశైలం రిజర్వాయర్​లో నీళ్లు నిండవు. నాగార్జున సాగర్‌ కు నీళ్లు వెళ్లే చాన్సే ఉండని పరిస్థితి నెలకొంటుంది. శ్రీశైలంపై ఆధారపడి తెలంగాణ చేపట్టిన కల్వకుర్తి, ఎస్‌ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌ స్కీంలతోపాటు సాగర్‌ ఎడమ కాల్వ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు చుక్క నీళ్లు కూడా రావు. నాలుగు జిల్లాల్లో దాదాపు 32 లక్షల ఎకరాలకు నీళ్లు అందవు.

పవర్​ జనరేషన్​పై భారీగా ఎఫెక్ట్

సంగమేశ్వరంతో  శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తిపైనా ఎఫెక్ట్​ పడుతుంది. ఇక్కడ పీక్​ సీజన్​లో 900 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. మిగతా టైంలోనూ అవసరానికి తగినట్టుగా నీటిని సాగర్​కు విడుదల చేస్తూ.. పవర్​ జనరేషన్​ కొనసాగిస్తారు. వానాకాలం​లో రాష్ట్రానికి అవసరమయ్యే కరెంటులో 20 శాతం దాకా శ్రీశైలం పవర్​ ప్లాంట్​ నుంచే వస్తుంది. ఏపీ సంగమేశ్వరం నుంచి నీళ్లన్నీ తరలించుకుపోతే.. శ్రీశైలం నుంచి కిందికి నీటి విడుదల తగ్గిపోతుంది. దీనివల్ల కరెంటు ఉత్పత్తి చేసే చాన్స్​ ఉండదు.

వరద పేరుతో..  అసలు నీళ్లకే ఎసరు

కృష్ణాలో వరద నీళ్లను తీసుకునేందుకే సంగమేశ్వరం చేపడ్తున్నామని ఏపీ వాదిస్తోంది. శ్రీశైలంలో పూర్తిగా 885 ఫీట్లకుపైగా నీళ్లు నిండి, గేట్లెత్తి కిందికి వదిలితే వాటిని వరద జలాలు అంటారు. కానీ ఏపీ సర్కారు సంగమేశ్వరం లిఫ్టును రిజర్వాయర్​ అడుగున 797 ఫీట్ల లెవల్‌ నుంచీ నీళ్లు ఎత్తిపోసుకునేలా నిర్మిస్తోంది. శ్రీశైలానికి ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌లో  వరద వస్తోంది. తర్వాత ప్రవాహాలు ఏమీ ఉండవు. ఏపీ ఈ రెండు నెలలే కాకుండా మిగతా ఏడాదంతా నీళ్లను తోడేసుకునేందుకు లిఫ్టును చేపట్టింది.

హైదరాబాద్​కు మంచి నీళ్లు ఎట్ల?

కోటి మందికిపైగా జనం బతికే గ్రేటర్ హైదరాబాద్ కు మంచినీళ్లు కృష్ణానది నుంచే ఎక్కువ  సరఫరా అవుతున్నాయి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి సరఫరా అయ్యే ఈ నీళ్లకూ సంగమేశ్వరంతో ఇబ్బంది రానుంది. శ్రీశైలం రిజర్వాయర్ వెనుక నుంచే నీళ్లని మళ్లించుకుపోతే ఇక ఆ ప్రాజెక్టును దాటి నీళ్లు నాగార్జున సాగర్​ వరకు వచ్చే అవకాశమే ఉండదు. దీంతో సాగునీళ్ల మాట పక్కనబెడితే తాగునీటికీ కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఎక్స్​పర్టులు స్పష్టం చేస్తున్నారు.

అప్పుడు లొల్లి పెట్టి.. ఇప్పుడు గప్​చుప్!

ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న వైఎస్  రాజశేఖరరెడ్డి 2005లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్  కెపాసిటీని 11,500 క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఈ నిర్ణయంపై మండిపడింది. దీన్నే నాడు టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఉద్యమానికి పునాదిగా వాడుకున్నారు. మన నీళ్లు దోచుకుపోతున్నారంటూ అగ్గిపుట్టించారు. ఇప్పుడు అదే టీఆర్ఎస్​ సొంత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. అటు ఏపీ సర్కారు అదే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కెపాసిటీని మరింత భారీగా పెంచేందుకు రెడీ అయింది. కానీ టీఆర్ఎస్​లో ఇప్పుడెందుకో ఆ అగ్గి చల్లారిపోయింది. ఉద్యమ పార్టీ కాస్తా అధికార పార్టీగా మారడంతో అందులో మిగిలిన ఉద్యమకారుల్లో ఉద్యమం పోయి… కారులే మిగిలినయి. పోతిరెడ్డిపాడు మరింత పెద్దగా నోరుతెరుచుకుంటుంటే మన లీడర్ల నోళ్లు మాత్రం పూర్తిగా మూతబడిపోయాయి. సీఎం కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు ఎవరూ నోరెత్తడం లేదు.

ప్రభుత్వాల మధ్య చీకటి ఒప్పందమా?

మన రైతుల నోట్లో మట్టికొట్టే ప్రాజెక్టుపై మేఘా స్పీడు పెంచినా టీఆర్​ఎస్​ సర్కారు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న చీకటి ఒప్పందం వల్లే మేఘా కంపెనీ ఈ ప్రాజెక్టు పనులను చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏకంగా లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు దక్కించుకున్న మేఘా కంపెనీ.. కేవలం రూ.3 వేల కోట్ల పనుల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా టీఆర్ఎస్​ సర్కారు సైలెంట్​గా ఉండటంతో పాలమూరు రైతులే న్యాయ పోరాటానికి దిగారు. ప్రత్యక్షంగా ఉద్యమం చేపట్టేందుకు కూడా
వారు రెడీ అవుతున్నారు.