గర్భిణీని కాపాడేందుకు డ్రైవర్ అవతారమెత్తిన డాక్టర్

గర్భిణీని కాపాడేందుకు డ్రైవర్ అవతారమెత్తిన డాక్టర్

ఓ మహిళా డాక్టర్ గర్భిణిని కాపాడేందుకు అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తింది. వైద్యుడిని దైవంతో సమానంగా చూస్తారు. దేవుడి తరువాత చేతులెత్తి మొక్కేది వైద్యుడికే . అందుకే సమాజంలో వైద్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. కానీ కొంతమంది వైద్యులు కాసులు కక్కుర్తితో ఆ వృత్తికి కళంకం తెస్తుంటే మరికొందరు మన్ననలు పొందుతున్నారు.

మేఘాలయ వెస్ట్ గారో హిల్స్ జిల్లాలోని గరోబధ అనే ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో బాల్నమంచి సంగ్మా డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్బిణీ అత్యవసర చికిత్స కోసం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కు వచ్చింది. వైద్య పరీక్షలు నిర్వహించిన సంగ్మా అత్యవసర చికిత్స మరో ఆస్పత్రికి తరలించాలని, లేదంటే కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమని గుర్తించింది. మరో ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ ఉన్నా డ్రైవర్ లేకపోవడం, సాయం చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో డాక్టర్ సంగ్మా అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తింది.

దైర్యంగా గర్బిణీని అంబులెన్స్ లోకి ఎక్కించి కోసం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని సురక్షితంగా ఆస్పత్రికి చేర్చింది. అప్పటికే అంబులెన్స్ కోసం ఎదురు చూస్తున్న వైద్యులు గర్బిణీకి వైద్యం అందించి ప్రమాదం నుంచి సురక్షితంగా గట్టెంక్కించారు.