గుడ్ బై చెప్పిన మిగ్ 27..చివరిసారి ఆకాశంలో చక్కర్లు

గుడ్ బై చెప్పిన మిగ్ 27..చివరిసారి ఆకాశంలో చక్కర్లు

మూడు దశాబ్దాల పాటు సేవలందించింది. యుద్ధంలో శత్రు సైన్యానికి ముచ్చెమటలు పట్టించింది. ఇక, రెస్ట్​ తీసుకుంటానంటూ బైబై చెప్పేసింది. చివరిసారి ఆకాశంలో దర్జాగా చక్కర్లు కొట్టి రాజస్థాన్​లోని జోధ్​పూర్​ ఎయిర్​బేస్​లో దిగింది. సేవల నుంచి పూర్తిగా సెలవు తీసుకుంది. మిగ్​27 శుక్రవారం రిటైర్​ అయిపోయింది. దానికి వాటర్​ శాల్యూట్​తో వీడ్కోలు పలికారు ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ (ఐఏఎఫ్​) అధికారులు. స్క్వాడ్రన్​ స్కార్పియన్​29లోని మొత్తం 7 విమానాలనూ ఐఏఎఫ్​ డీకమిషన్​ చేసింది. అంతకుముందు 2017లో మరో రెండు స్క్వాడ్రన్లకు చెందిన మిగ్​27 విమానాలూ రిటైర్​ అయిపోయాయి. పశ్చిమబెంగాల్​లోని హషిమర ఎయిర్​బేస్​లో రెస్ట్​ తీసుకుంటున్నాయి.

కార్గిల్​ వార్​లో ముఖ్య పాత్ర

ఐఏఎఫ్​లోకి మిగ్​27 విమానాలు 1985లో ఎంటరయ్యాయి. దేశ యుద్ధ సామర్థ్యాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. కార్గిల్​ యుద్ధంలో పాక్​ సైన్యానికి ముచ్చెమటలు పట్టించాయి. కార్గిల్​ సెక్టార్​లోకి దొడ్డిదారిన చొరబడ్డ పాక్​ సైనికులను తరిమి తరిమి కొట్టాయి. శత్రు స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాయి. ఆపరేషన్​ సఫేద్​​ సాగర్​లో భాగంగా పాక్​ సైనికులను తరిమికొట్టాయి. కార్గిల్​ యుద్ధ గెలుపులో ముఖ్య పాత్ర పోషించాయి.

అవే దాని బలాలు

మిగ్​27 యుద్ధ విమానాలను రష్యా (సోవియట్​ యూనియన్​) తయారు చేసింది. సింగిల్​ ఇంజన్​, సింగిల్​ సీటర్​ వ్యూహాత్మక ఫైటర్​ ఇది. రష్యా నుంచి కొనుగోలు చేసినా తర్వాతి కాలంలో హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హాల్​) ఆధ్వర్యంలో ఇండియాలోనే అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. గంటకు 1,885 కిలోమీటర్ల వేగంతో (మాక్​1.6 – సౌండుకు ఒకటిన్నర రెట్ల వేగం) దూసుకెళ్లడం దీని స్పెషాలిటీ. రోటరీ ఇంటిగ్రల్​ కెనాన్​ ఇందులో ఇన్​బిల్ట్​గా ఉంటుంది. ఇక, బయటి నుంచి 4 వేల కిలోల దాకా యుద్ధ సామగ్రిని మోసుకెళ్లగల సత్తా దీని సొంతం.

ఇవీ బలహీనతలు

అన్ని బలాలున్నా ఒకే ఒక్క లోపం దాని సామర్థ్యంపై పెద్ద అనుమానాలనే రేకెత్తించింది. ఎప్పుడూ అవి కూలిపోతుండేవి. మామూలు ఆపరేషన్లకు వెళ్లి పదుల సంఖ్యలో విమానాలు కూలిపోయాయి. పైలట్లను బలి తీసుకున్నాయి. అదే దానికి ఉన్న పెద్ద మచ్చ. మొత్తంగా 482 మిగ్​27లు ప్రమాదాలకు గురయ్యాయని 2012లో నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పార్లమెంట్​లో వెల్లడించారు కూడా. విమానంలోని ఆర్​29 ఇంజన్లలోని లోపం వల్లే అవి తరచూ కూలుతున్నాయన్నది నిపుణులు చెప్పే మాట. అవి తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో 2010 ఫిబ్రవరిలో దాదాపు 150 యుద్ధ విమానాలను మూలకు పెట్టేశారు. ఆ తర్వాతా కొన్ని ఆపరేషన్లు చేసినా మళ్లీ ప్రమాదాలు మామూలు అయిపోవడంతో 2017 డిసెంబర్​లో రెండు స్క్వాడ్రన్న మిగ్​ 27ఎంఎల్​ విమానాలను రిటైర్​ చేసేసింది ఐఏఎఫ్​. మొత్తం 165 విమానాలుండగా, 150 విమానాలు పోను 15 మిగిలాయి. వాటిలోనూ మూడు ప్రమాదాల్లో పాడైపోవడంతో మిగిలినవి 12. ఇప్పుడు ఆ విమానాలన్నీ రిటైర్​ అయిపోతున్నాయి.

వాటిని ఏం చేస్తారు?

మిగిలిన విమానాలను ఏం చేస్తారన్నదానిపైనే ఆసక్తి ఉంది. ఇప్పటికైతే దాని గురించి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రక్షణ శాఖ ప్రతినిధి కర్నల్​ సంబిత్​ ఘోష్​ చెప్పారు. వాటిని ఎయిర్​బేస్​ లేదా డిపోల్లో గుర్తుగా దాచిపెట్టే అవకాశం ఉందంటున్నారు. లేదంటే వేరే దేశాలకైనా ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. అంతేగాకుండా ఇంట్రెస్ట్​ చూపించే సంస్థలకు వాటినిచ్చే యోచనలోనూ ఉన్నట్టు ఎయిర్​ఫోర్స్​ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ముద్దుపేర్లు

బహదూర్​: 1999 కార్గిల్​ యుద్ధం టైంలో దాన్ని నడిపిన ఐఏఎఫ్​ పైలట్లు దానికి పెట్టిన ముద్దు పేరు ఇది. బహదూర్​ అంటే ధైర్యశాలి అని అర్థం.

బాల్కన్​: అంటే బాల్కనీ అని అర్థం. కాక్​పిట్​లో నుంచి చుట్టుపక్కలా కచ్చితత్వమైన వ్యూ ఉండడంతో టెస్ట్​ పైలట్లు దానికి ఆ పేరు పెట్టారు.

ఉత్కోనోస్​: ప్లాటిపస్​ అనే ఓ జంతువు పేరిది. మిగ్​ 27 విమానం ముక్కు కూడా, ఆ జంతువు ముక్కులాగే ఉండడం వల్ల ఆ పేరు పెట్టారు రష్యా పైలట్లు.

ఫ్లాగర్​: మిగ్​23 నుంచి మిగ్​27గా అప్​గ్రేడ్​ కావడంతో నాటో దళాలు దానికి ‘ఫ్లాగర్​’ అన్న పేరునిచ్చాయి.