మొబైల్‌‌ ఫోన్‌‌ ఎగుమతులు 8 రెట్లు పెరిగినయ్​

మొబైల్‌‌ ఫోన్‌‌ ఎగుమతులు 8 రెట్లు పెరిగినయ్​

ఇండియా నుంచి మొబైల్‌‌ ఫోన్ల ఎగుమతులు 2018–19లో ఏకంగా 8 రెట్లు పెరిగి రూ. 11,200 కోట్లకు చేరినట్లు ఇండియన్‌‌ సెల్యులార్‌‌ అండ్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌ అసోసియేషన్‌‌ (ఐసియా) వెల్లడించింది. ఏప్రిల్‌‌ – జూలై 2019 మధ్య కాలంలో ఈ హ్యాండ్‌‌సెట్‌‌ ఎగుమతులు రూ. 7 వేల కోట్లని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు రూ. 25 కోట్లను మించుతాయనే ధీమాను వ్యక్తం చేసింది. 2017–18తో పోలిస్తే మొబైల్‌‌ హ్యాండ్‌‌సెట్‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌ రంగం 800 శాతం వృద్ధి సాధించినట్లైంది. ఇది అద్భుతమైన ప్రారంభమని ఐసియా ఛైర్మన్‌‌ పంకజ్‌‌ మొహింద్రూ పేర్కొన్నారు. 2018–19 లో ఇండియాలో మొబైల్‌‌ హ్యాండ్‌‌సెట్స్‌‌ తయారీ యూనిట్ల పరంగా 29 కోట్లకు, విలువ పరంగా రూ. 1.81 లక్షల కోట్లకు చేరింది. 2014–15 లోనైతే కేవలం రూ. 18,900 కోట్ల విలువైన 5.8 కోట్ల యూనిట్లు మాత్రమే ఇక్కడ తయారయ్యాయి. నోకియా ప్లాంట్‌‌ మూసివేత తర్వాత ఎగుమతులు దాదాపు శూన్యమైనట్లు ఐసియా తెలిపింది. 2020 నాటికి ఎలక్ట్రానిక్స్‌‌ రంగంలో దిగుమతులే ఉండకూడదంటూ 2014 లోనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 నాటికి దేశంలో రూ. 7 లక్షల కోట్ల విలువైన 100 కోట్ల మొబైల్‌‌ హ్యాండ్‌‌సెట్స్‌‌ తయారు కావాలని తాజాగా ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొబైల్‌‌ హ్యాండ్‌‌సెట్స్‌‌ దేశీయ మార్కెట్‌‌ డిమాండ్‌‌లో దిగుమతుల వాటా ప్రస్తుతం బాగా తగ్గి 6 శాతానికి పరిమితమైందని, ఇది 2014–15 లో 80 శాతంగా ఉండేదని ఐసియా పేర్కొంది. 2018–19 లో తొలిసారిగా మొబైల్‌‌ హ్యాండ్‌‌సెట్స్‌‌ దిగుమతులను మించి ఇండియా ఎగుమతులు నమోదయ్యాయని మొహింద్రూ వెల్లడించారు. 2018–19 లో మొబైల్‌‌ హ్యాండ్‌‌సెట్స్‌‌ దిగుమతులు రూ. 10 వేల కోట్లు. ఎగుమతులు భారీగా పెరగడం ఒక ముఖ్యమైన మైలురాయిగా మొహింద్రూ వ్యాఖ్యానించారు.