సిటీ రోడ్లపై సిన్మా చూయిస్తున్రు

సిటీ రోడ్లపై సిన్మా చూయిస్తున్రు

ప్రధాన మార్గాల్లో సినీ ఈవెంట్స్​కు పర్మిషన్ ఇస్తున్న పోలీసులు

హాస్పిటల్ ఏరియాల్లోనూ ఇదే తీరు
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
వాహనదారులకు తప్పని తిప్పలు

చిన్నపాటి సభలు, సమావేశాలు, ఆందోళనల సమాచారం తెలిస్తేనే అలర్ట్ అయ్యి హైరానా పడే సిటీ పోలీసులు… సినీ ప్రముఖుల కార్యక్రమాలపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడలేని ఉత్సాహంతో నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు నడిరోడ్డుపై నరకం చూస్తున్నా పట్టించుకోవడం లేదు. బుధవారం కళింగ భవన్ వద్ద ఓ హీరో ఫొటో షూట్ వల్ల బంజారా హిల్స్ రోడ్ నం.10, 12, ఎమ్మెల్యే కాలనీ, అపోలో సిగ్నల్, మినిస్టర్ క్వార్టర్స్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆస్పత్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పర్మిషన్ ఎలా ఇస్తారని పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  రెండు రోజుల క్రితం ఫస్ట్ బెటాలియన్ గ్రౌండ్​లో నిర్వహించిన సినీ కార్యక్రమం సందర్భంగానూ యూసుఫ్ గూడ  రోడ్లు బ్లాక్ అయ్యాయి.

హైదరాబాద్, వెలుగు : సిటీలో ప్రధాన మార్గాలు, టూరిస్టు ప్రాంతాల్లో జరిగే సినీ కార్యక్రమాలు, షూటింగ్ లంటే అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ షూటింగ్ స్పాట్ లో సందడి చేద్దామనే ఉత్సాహంలో పడి వాహనదారులు, స్థానికుల ఇబ్బందులను సినీ అభిమానులు మరిచిపోతుంటారు. దీంతో ఆ పరిసరాల్లోని విపరీతమైన ట్రాఫిక్​జామ్​లు ఏర్పడుతున్నాయి. అయితే జనావాసాలకు ఇబ్బంది  కలిగించకుండా సభలు, కార్యక్రమాలు, షూటింగ్ లకు అనుమతించరాదనే నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ కార్యక్రమాలను నిర్వహించుకోవాలనుకున్నా ముందుగా పోలీసుల పర్మీషన్ తీసుకోవాలి. దీనికి తగ్గట్లుగా ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్ చేస్తూ పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ ఇలాంటి ముందస్తు చర్యలేవీ లేకుండా సెలబ్రిటీ ఈవెంట్లకు ఎగబడి పరిమితులిస్తున్న నగర పోలీసుల తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కళ్యాణ్ రామ్​ ఫొటో షూట్​తో రోడ్లన్నీ జామ్

ప్రముఖులు, ఐటీ ఉద్యోగులు, చిరు ఉద్యోగులు, రాజకీయ నాయుకుల తాకిడి ఎక్కువగా ఉండే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో నిత్యం ఏదొక చోట సినీ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. బుధవారం బంజారా హిల్స్ రోడ్ నెం.12 లో కళింగ భవన్ వద్ద జరిగిన కళ్యాణ్​రామ్​ ఫొటో షూట్ తో ఆ ఏరియాలో రోడ్లన్నీ  వాహనాలతో నిండిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12,  రోడ్ నెం.10, ఎంఎల్ఏ కాలనీ, బంజారా హిల్స్, అపోలో సిగ్నల్ నుంచి మొదలుకుని మినిస్టర్ క్వార్టర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇలాంటి ప్రాంతంలో సినీ కార్యక్రమాలు నిర్వహించడమేంటని నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం యూసుఫ్ గూడలోని పోలీసు బెటాలియన్ గ్రౌండ్ లో నిర్వహించిన మరో సినీ కార్యక్రమానికి భారీగా అభిమానులు రావడంతో అమీర్ పేట, కృష్ణానగర్, జూబ్లీ హిల్స్, యూసుఫ్ గూడ చెక్ పోస్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ ట్రాఫిక్​దిగ్బంధనంలో చిక్కుకున్నాయి.

వినకుంటే లాఠీచార్జి

ఏడాదిన్నర క్రితం మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం లక్డీకాపూల్ లోని ఓ సినిమా థియేటర్ కు వస్తున్నాడనే విషయం తెలిసి అభిమానులు భారీగా హాజరయ్యారు. ఫ్యాన్స్​ తాకిడితో తొక్కిసలాట జరిగింది. దీంతో జనాలను చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వాస్తవానికి సెలబ్రిటీల కార్యక్రమాలన్నీ బందోబస్తుపై పక్కాగా ఉండాలి. గతనెల 25న శేరిలింగంపల్లిలో జరిగిన అదే హీరోతో ఫ్యాన్స్​ఫొటో షూట్ లో తొక్కిసలాట జరగడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కార్యక్రమం అర్ధంతరంగా
ఆగిపోయింది.