వైభవంగా ముక్కోటి ఏకాదశి : ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ

వైభవంగా ముక్కోటి ఏకాదశి : ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగతోంది. పాతగుట్టలో వైకుంఠ ద్వార దర్శనమిస్తున్నారు నరసింహస్వామివారు. దీంతో ఉదయం నుంచే భక్తులు భారులు తీరారు. నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మార్మోగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి శోభ నెలకొంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ‘శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులతో పాటు, వీఐపీలు క్యూ కట్టారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్  ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. కాసేపట్లో  తిరుమాడవీధులలో స్వర్ణరథంపై  మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైకుంఠ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా  వేంకటేశ్వరస్వామి ఆలయాలన్నీ పూలమాలలతో అందంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. శ్రీహరి నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

సింహాచలం అప్పన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలు, అందమైన పుష్పాలతో ఆలయాన్ని మనోహరంగా అలంకరించారు. స్వామివారి ఉత్తరద్వార దర్శనానికి అర్థరాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అప్పన్న స్వామిని దర్శించుకుని తరిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూకట్టారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా బంజారాహిల్స్  టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.  స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. వైకుంఠ ద్వార దర్శనానికి 20 నిమిషాల సమయం పడుతోంది.