సన్‌ డౌన్‌..ముంబై విన్..34 రన్స్ తేడాతో హైదరాబాద్ ఓటమి

సన్‌ డౌన్‌..ముంబై విన్..34 రన్స్ తేడాతో హైదరాబాద్ ఓటమి

సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మళ్లీ డీలా పడింది. లాస్ట్‌‌ రెండు మ్యాచ్‌‌ల్లో పటిష్ట ఢిల్లీ, చెన్నైకి చెక్‌‌ పెట్టి గెలుపు బాట పట్టిన వార్నర్‌‌‌‌సేన ముంబైకి ముకుతాడు వేయలేకపోయింది. తమ బలమైన బౌలింగ్‌‌లో  తేలిపోయి  ప్రత్యర్థికి భారీ స్కోరు ఇచ్చుకున్న రైజర్స్‌‌ మరోసారి మిడిలార్డర్‌‌ ‌‌వైఫల్యంతో చిత్తుగా ఓడింది. కెప్టెన్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌ (44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.  మరోవైపు క్వింటన్‌‌ డికాక్‌‌(39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) హాఫ్ సెంచరీతో పాటు  చివర్లో హార్దిక్‌‌ పాండ్యా (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 నాటౌట్‌‌), కీరన్  పొలార్డ్‌‌(13 బంతుల్లో 3 సిక్సర్లతో 25 నాటౌట్‌‌), క్రునాల్‌‌ పాండ్యా (4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 నాటౌట్‌‌) ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో 200 ప్లస్‌‌ స్కోరు చేసిన ముంబై బౌలింగ్‌‌లోనూ మెప్పించింది.

షార్జాముంబై ఇండియన్స్‌‌ మరోసారి టాప్‌‌ క్లాస్‌‌ ఆటతో అదరగొట్టింది. వరుసగా రెండో మ్యాచ్‌‌లో వన్‌‌సైడ్‌‌ విక్టరీ సాధించింది.  ఆదివారం మధ్యాహ్నం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 34 పరుగుల తేడాతో సన్‌‌రైజర్స్‌‌ను ఓడించింది.  ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 5  వికెట్లకు 205 రన్స్‌‌ చేసింది.  భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఓవర్లన్నీ ఆడిన హైదరాబాద్‌‌174/7 స్కోరుకే  పరిమితమైంది. ముంబై  బౌలర్లలో బౌల్ట్‌‌ (2/28), ప్యాటిన్సన్‌‌ (2/29), బుమ్రా (2/41) తలో రెండు వికెట్లతో తమ జట్టును గెలిపించారు. బౌల్ట్‌‌కు మ్యాన్‌‌ ఆఫ్​ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.

డికాక్‌‌ ధనాధన్‌‌

టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన ఓపెనర్‌‌‌‌ రోహిత్‌‌ (6) నాలుగో బాల్‌‌కే సిక్సర్‌‌ ‌‌కొట్టాడు. కానీ నెక్ట్స్‌‌ బాల్‌‌కే  అతడిని కాట్‌‌ బి హైండ్‌‌ చేసిన సందీప్‌‌ శర్మ (2/41) రివెంజ్‌‌ తీర్చుకున్నాడు. సెకండ్‌‌ ఓవర్లో నటరాజన్‌‌ ( 0/29) ఒక్క పరుగే ఇవ్వగా.. సిద్దార్థ్‌‌ కౌల్‌‌ (2/64) బౌలింగ్‌‌లో డికాక్  ఓ ఫోర్‌‌‌‌, సూర్యకుమార్‌‌ (18 బంతుల్లో 6 ఫోర్లతో 27) ‌‌వరుసగా మూడు బౌండ్రీలతో అలరించాడు. కౌల్‌‌ వేసిన ఆరో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన సూర్య ఇంకో షాట్‌‌ఆడే ప్రయత్నంలో నటరాజన్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. దాంతో  పవర్‌‌‌‌ప్లేలో ముంబై 48/2తో నిలిచింది. సమద్‌‌ (0/27) వేసిన నెక్ట్స్‌‌ ఓవర్లో డికాక్‌‌ కూడా వెనుదిరగాల్సింది. అతనిచ్చిన ఓవర్‌‌‌‌ హెడ్‌‌ క్యాచ్‌‌ను లాంగాన్‌‌లో మనీశ్‌‌ డ్రాప్‌‌ చేయగా అది సిక్సర్‌‌‌‌గా వెళ్లింది. ఇషాన్‌‌ కిషన్‌‌ (23 బంతుల్లో 1 ఫోర్‌‌‌‌, 2 సిక్సర్లతో 31) స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసే బాధ్యత తీసుకోగా డికాక్‌‌ భారీ షాట్లతో విజృంభించాడు. సమద్‌‌ బౌలింగ్‌‌లోనే 6, 4 రాబట్టాడు. అప్పటికే రషీద్‌‌ఖాన్‌‌ (1/22)ను బౌలింగ్‌‌కు దింపిన వార్నర్‌‌ ‌‌అనూహ్యంగా పదో ఓవర్‌‌ ‌‌నుంచి విలియమ్సన్‌‌ (0/24)కు బంతి అప్పగించాడు.   కానీ అతను  వేసిన 12 వ ఓవర్లో డికాక్‌‌, ఇషాన్ చెరో సిక్సర్‌‌‌‌తో 17 రన్స్‌‌ పిండుకోగా స్కోరు వంద దాటింది. 32 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న క్వింటన్‌‌.. కౌల్‌‌ బౌలింగ్‌‌లో 4,6 బాది సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే14 ఓవర్‌‌ ‌‌ఫస్ట్‌‌బాల్‌‌కు రిటర్న్‌‌ క్యాచ్‌‌తో అతడిని ఔట్‌‌ చేసిన రషీద్‌‌ జట్టుకు బ్రేక్‌‌ ఇవ్వగా.. ఆ వెంటనే ఇషాన్‌‌ కిషన్‌‌ను సందీప్‌‌ పెవిలియన్‌‌ చేర్చాడు.

పొలార్డ్‌‌, పాండ్యా బ్రదర్స్‌‌ ఫినిషింగ్‌‌ టచ్‌‌

15 ఓవర్లకు ముంబై 147/4తో నిలిచింది. తర్వాతి ఓవర్లో రషీద్‌‌ రెండే పరుగులివ్వడంతో  180  రన్స్‌‌ చేస్తే గొప్పే అనిపించింది. అయితే హార్దిక్‌‌తో పాటు పొలార్డ్‌‌ స్లాగ్‌‌ ఓవర్లో భారీ షాట్లతో చెలరేగారు.  కౌల్‌‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్‌‌‌‌ సెకండ్‌‌ బాల్‌‌కు హార్దిక్‌‌ ఔటైనా తర్వాతి 4 బాల్స్‌‌ను 6,4, 4, 6 గా మలచిన  క్రునాల్‌‌ పాండ్యా (20 నాటౌట్‌‌) స్కోరు ‌‌200 దాటించాడు. చివరి నాలుగు ఓవర్లలోనే  59 రన్స్‌‌ వచ్చాయి.

వార్నర్‌‌‌‌ పోరాడినా

టార్గెట్‌‌ ఛేజ్‌‌లో వార్నర్‌‌ అద్భుతంగా పోరాడినా, మిడిలార్డర్‌‌‌‌ నుంచి సహకారం లేకపోవడంతో  జట్టు గమ్యాన్ని అందుకోలేకపోయింది. ఇన్నింగ్స్‌‌ మూడో బాల్‌‌నే సిక్సర్‌‌గా మలిచిన బెయిర్‌‌స్టో (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25).. ప్యాటిన్సన్‌‌ ఓవర్లో రెండు ఫోర్లు, క్రునాల్‌‌(1/35) బౌలింగ్‌‌లో ఇంకో సిక్సర్‌‌‌‌ కొట్టాడు. కానీ ఫిఫ్త్‌‌ ఓవర్లో అతడిని ఔట్‌‌చేసిన బౌల్ట్‌‌ ముంబైకి ఫస్ట్‌‌ బ్రేక్‌‌ఇచ్చాడు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన మనీశ్‌‌ పాండే (19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌‌‌‌తో 30) అదే ఓవర్లో రెండు ఫోర్లు బాదగా.. బుమ్రా బౌలింగ్‌‌లో వార్నర్‌‌ ‌‌కూడా రెండు బౌండ్రీలు కొట్టడంతో పవర్‌‌‌‌ప్లేలో 51 రన్స్‌‌ వచ్చాయి. అయితే హార్దిక్‌‌ క్యాచ్‌‌ డ్రాప్‌‌ చేయడంతో వచ్చిన లైఫ్‌‌ను మనీశ్‌‌ యూజ్‌‌ చేసుకోలేకపోయాడు. ప్యాటిన్సన్‌‌ వేసిన పదో ఓవర్లో లాఫ్టెడ్‌‌ షాట్‌‌ఆడిన అతను లాంగాఫ్‌‌లో పొలార్డ్‌‌కు  చిక్కడంతో  సెకండ్‌‌ వికెట్‌‌కు 60 రన్స్‌‌  పార్ట్​నర్ షిప్ బ్రేక్‌‌ అయింది. అయినా వెనక్కు తగ్గని వార్నర్‌‌‌‌… క్రునాల్‌‌ బౌలింగ్‌‌లో 6,4 బాది స్కోరు వంద దాటించాడు. అలాగే  ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ 13వ ఓవర్లో విలియమ్సన్‌‌(3)ను ఔట్‌‌ చేసిన బౌల్ట్‌‌.. రైజర్స్‌‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.  లాస్ట్ మ్యాచ్‌‌ హీరో ప్రియమ్‌‌ గార్గ్‌‌ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. దాంతో వార్నర్‌‌‌‌ ఒంటరి వాడయ్యాడు. రన్‌‌రేట్‌‌ కూడా తగ్గిపోవడంతో ఒత్తిడి పెరిగింది. 17వ ఓవర్లో ప్యాటిన్సన్‌‌ వేసిన లెగ్‌‌ కట్టర్‌‌‌‌ను థర్డ్‌‌ మ్యాన్‌‌ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. గాల్లోకి లేచిన బాల్‌‌ను.. ముందుకు డైవ్‌‌ చేస్తూ  ఇషాన్‌‌ కిషన్‌‌ పట్టిన సెన్సేషనల్‌‌ క్యాచ్‌‌కు వార్నర్‌‌‌‌ వెనుదిరగడంతో మ్యాచ్‌‌ ముంబై చేతుల్లోకి వెళ్లింది. యంగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ ‌‌అబ్దుల్‌‌ సమద్‌‌(9 బంతుల్లో 20) రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌‌‌‌తో పోరాడే ప్రయత్నం చేసినా 19వ  ఓవర్లో అతనితో పాటు అభిషేక్‌‌ శర్మ (10)ను బుమ్రా పెవిలియన్‌‌కు చేర్చడంతో హైదరాబాద్‌‌కు భారీ ఓటమి తప్పలేదు.