టీఆర్ఎస్ సర్కార్​కు మునుగోడు ఫీవర్

టీఆర్ఎస్ సర్కార్​కు మునుగోడు ఫీవర్
  • దళితబంధు ఇప్పుడొద్దు
  • సర్కార్​కు టీఆర్​ఎస్​ లోకల్​ లీడర్ల మొర 
  • హుజూరాబాద్ లెక్క రివర్స్ అయితదని భయం 
  • 1,500 మందికే ఇస్తే మిగిలినోళ్ల నుంచి వ్యతిరేకత వస్తదని ఆందోళన 
  • ఎన్నిక తర్వాత అందరికీ ఇస్తామంటూ దళితుల ఓట్లు పొందే ఎత్తుగడ 

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ సర్కార్​కు మునుగోడు ఫీవర్ పట్టుకుంది. అక్కడ ఉప ఎన్నిక ముగిసే వరకూ దళితబంధు స్కీమ్​ను పక్కన పెట్టాలని లోకల్​ లీడర్లు ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున దళితబంధు ఇచ్చేందుకు అవకాశం ఉంది. నియోజకవర్గంలో వేల సంఖ్యలో దళితుల కుటుంబాలు ఉండగా... కొందరికే ఇస్తే మిగతా వాళ్ల నుంచి వ్యతిరేకత వస్తుందని చెబుతున్నారు. మిగిలినోళ్లందరూ నిలదీస్తే ఇబ్బందులు వస్తాయని నల్గొండ నేతలు మీటింగ్​లో చర్చించుకున్నారని, అందుకే సీఎంని కలిసి ఇప్పట్లో వద్దని చెప్పారని తెలిసింది. మునుగోడులో ఈ స్కీమ్ అమలు చేస్తే మొదటికే మోసం వస్తుందని టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఆలోచనలో పడింది. హుజూరాబాద్​లో మాదిరి సీన్ రివర్స్ అయ్యే చాన్స్ ఉండటంతో పథకాన్ని ఆపాలని భావిస్తోంది. అసలే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదని, ఇప్పుడు దళితబంధు ఇస్తే.. అది మరింత డ్యామేజ్ చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు దళితబంధును ఆపి వ్యతిరేకతను తప్పించుకోవాలని అనుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్.. అదే దళితబంధు పేరుతో దళితుల ఓట్లు పొందాలని  చూస్తోంది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సపోర్టు చేస్తే, గెలిచినంక అందరికీ దళితబంధు ఇస్తామని ఓటర్లకు గాలం వేస్తోంది. 

లిస్టు సిద్ధం చేసి పక్కన పెట్టిన్రు..  

మునుగోడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, పదవికి ఇటీవల రాజీనామా చేశారు. అయితే అంతకంటే ముందే ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి టీఆర్ఎస్ లీడర్లు దళితబంధుకు పలువురి పేర్లను సూచించారు. 1,500 మందితో లిస్టు కూడా ఎప్పుడో సిద్ధం చేశారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి దగ్గర ఆ లిస్ట్ ఉన్నట్లు తెలిసింది. అయితే నియోజకవర్గంలో మొత్తం 14,124 దళిత కుటుంబాలు ఉన్నాయి. కేవలం 1,500 మందికే ఇస్తే, మిగిలిన వారి నుంచి వ్యతిరేకత పెరుగుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే దళితబంధు స్కీమ్ ‘‘ఇప్పుడు వద్దంటే.. వద్దు’’ అని మంత్రి మొత్తుకుంటున్నారని చర్చ జరుగుతోంది. కాగా, పోయినేడు నియోజకవర్గానికి 100 మందికి దళితబంధు ఇచ్చారు. ఇందులో భాగంగా మునుగోడు మండలం జమస్తాన్ పల్లిలో 39 మందికి, నారాయాణ్ పూర్ మండలం గుడ్డి మల్కాపురంలో 26 మందికి, చిమిర్యాలలో 35 మందికి ఇచ్చారు. 

హుజూరాబాద్ ఎఫెక్ట్​తో...  

పోయినేడు హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరిగింది. కేవలం బై ఎలక్షన్ ను దృష్టిలో పెట్టుకొని ఆ నియోజకవర్గంలోని దళితులంరదికీ దళితబంధు ఇస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈటల రాజేందర్ రాజీనామాతోనే తమకు దళితబంధు వచ్చిందని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రజలకు అర్థమైంది. పైగా దళితబంధు సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన ప్రభుత్వం.. వాటిని వాడుకునేందుకు వీలు లేకుండా ఫ్రీజ్ చేసింది. ఇలా అన్నీ సర్కార్ కు వ్యతిరేకంగా మారడంతో టీఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. ఇప్పుడు మునుగోడులోనూ దళితబంధు అమలు చేస్తే ప్రజలు తిరగవడ్తదని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. హుజూరాబాద్ మాదిరి కావొద్దంటే ఉప ఎన్నిక ముగిసే వరకు దళితబంధు ఇవ్వకపోవడమే మంచిదని అంటున్నారు. 

గెలిచాక ఇస్తమంటూ గాలం.. 

ఉప ఎన్నిక ముగిసే వరకూ దళితబంధు అమలు ఆపాలని నిర్ణయించిన టీఆర్ఎస్.. ఆ వర్గం ఓటర్లను వారివైపు తిప్పుకునేందుకు మరో ఎత్తుగడ వేసింది. మండలాలు, గ్రామాల వారీగా దళిత నాయకులతో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమవుతు న్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్​ను గెలిపిస్తే.. ఊరోళ్లందరికీ దళితబంధు ఇస్తామంటూ హామీలు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. తన దగ్గరికి వస్తున్న వివిధ గ్రామాల దళితులకు మంత్రి ఇట్లనే చెప్తున్నట్లు తెలిసింది.