రూల్స్​ బ్రేక్​ చేస్తే జైలుకే: నేటి నుంచి కొత్త ఎంవీ యాక్ట్‌ అమలు

రూల్స్​ బ్రేక్​ చేస్తే జైలుకే: నేటి నుంచి కొత్త ఎంవీ యాక్ట్‌ అమలు

హైదరాబాద్,వెలుగు:  రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రూపొందించిన మోటార్ వెహికల్ యాక్ట్––2019 నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలు కానుండగా..రాష్ట్రంలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే డ్రంకెన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం లాంటి కోర్టు శిక్ష విధించే కేసులకు ఈ కొత్త చట్టం నేటి నుంచి వర్తిస్తుందని అధికారులు అంటున్నారు. సవరణలు చేసిన ఎంవీ యాక్ట్–2019 బిల్లు ఈ ఏడాది జులైలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. కొత్త చట్టం ప్రకారం రూల్స్ పాటించని వాహనదారులకు ఇక నుంచి రూ.500 నుంచి 25వేల వరకు ఫైన్ లు,  జైలు శిక్షలు విధించనున్నారు. సామాన్యునిపై తీవ్ర ప్రభావం చూపనున్న చట్టం అమలుపై రాష్ట్రంలో అయోమయం నెలకొంది.

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్, జరిమానాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఎంవీ యాక్ట్-–2019 అమలు చేసేందుకు రవాణాశాఖ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త చట్టంలోని 28 అంశాల్లో ప్రధానంగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం , సిగ్నల్ జంపింగ్  లాంటివి  సామాన్య వాహనదారుడిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇందులో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసేవారు రూ. వెయ్యి , స్టాప్ లైన్,సిగ్నల్ జంపింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్,ర్యాష్ డ్రైవింగ్ చేసే వారు రూ.5 వేలు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మైనర్లకు వెహికల్ ఇచ్చే తల్లిదండ్రులకు రూ.25వేల ఫైన్ తో పాటు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద మూడేళ్ళ జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్త చట్టంపై వాహనదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, విత్ అవుట్ డ్రైవింగ్ లైసెన్స్  తప్ప మిగతా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ విషయంలో ఈ చట్టం అమల్లో ఉండదు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రోడ్ల పరిస్థితులపై ఇప్పటికే వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీఏ నుంచి ఆదేశాలు రాగానే..

ఆర్టీఏ నుంచి ఆదేశాలు వచ్చాకే  ఎంవీ యాక్ట్ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని  ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా నేటి నుంచి ఎంవీఐ సవరణ యాక్ట్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ జరిమానాల విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. రాష్ట్రప్రభుత్వం జరిమానాల అమలు విషయంలో ఇంకా  స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.    కొత్త జరిమానాల విషయంలో ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. సిటి జనం ప్రతి ఒక్కరూ ఈ యాక్ట్ పై వ్యతిరేకతతో ఉన్నారు.  మరో ఏడాది లో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంవీఐ యాక్ట్ ను అమలు చేస్తే పార్టీకి నష్టం జరగవచ్చని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోర్టుకు వెళ్లే చలాన్ల విషయంలో ఈ చట్టాన్ని అమలు చేయనున్నారు.