ఎస్సీ, ఎస్టీ, బిసీల రాజ్యాధికారం కోసం.. రాష్ట్రంలో కొత్త పార్టీ

ఎస్సీ, ఎస్టీ, బిసీల రాజ్యాధికారం కోసం.. రాష్ట్రంలో కొత్త పార్టీ

అణగారిన వర్గాల విముక్తి దిశగా అంబేడ్కర్ సిద్ధాంత భూమికతో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం అయింది. ఎస్సీ, ఎస్టీ, బిసీల రాజ్యాధికారం కోసం విశారధన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ గడ్డపై ఇకనుంచి ఎస్సీ, ఎస్టీ, బిసీల రాజకీయ ప్రస్థానం మొదలయిందని అన్నారు. 

రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసీ బిడ్డలకు స్థానం లేకుండా పోతోందని అన్న విశారదన్.. ఇక నుంచి రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసీ వాటా తీసుకుంటామని వెల్లడించారు. వందకు ఒక్క శాతం మాత్రమే ఉన్న అగ్ర కులస్థులు రాజ్యాధికారం తీసుకుంటుంటే.. 90 శాతం ఉన్న మా బిడ్డలు ఏం చేయాలని ప్రశ్నించారు. 

ఎస్సీ, ఎస్టీ, బిసీ బిడ్డలను చదువుకోనిస్తే.. వాళ్లు ఇప్పటికి అమెరికాలో చక్రం తిప్పే వాళ్లని విశారదన్ అన్నారు. కేసీఆర్ పై తీవ్రంగా మండి పడ్డ ఆయన.. కుల, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కూలీలుగా తమ బిడ్డలు రక్తాలు ధారబోస్తుంటే.. ఇక్కడ దొరలు పాలన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తెలంగాణ గడ్డపై నుంచి మొదలుపెట్టి అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీని విస్తిరస్తామని విశారదన్ తెలిపారు.

వచ్చే ఎన్నికలలో అన్ని నియోజికవర్గాల్లోనూ ధర్మ సమాజ్ పార్టీ  పోటీ చేస్తుందని చెప్పారు. మే 2వ తేదీ నుండి అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మ సమాజ్ పార్టీ పోరాటాన్ని ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ తో పోరాటాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.