నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేది ఖరారు

నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేది ఖరారు

నిర్భయ దోషులను ఈనెల 20న ఉరి తీయనున్నారు. నలుగురు దోషులకు ఉదయం 5:30 గంటలకు ఉరి శిక్షను అమలు చేయాలని పటియాల్ హోస్ కోర్టు డెత్ వారెంట్ ఇచ్చింది. దోషులకు అన్ని న్యాయపరమైన అవకాశాలు ముగియడంతో .. పటియాలా హోస్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

నిర్భయ దోషులను డెత్ వారెంట్ రావడం ఇదో నాలుగవసారి. గతంలో మూడు సార్లు డెత్ వారెంట్ ఇచ్చినా .. దోషులు కోర్టులకు వెళ్లడంతో వాయిదా పడింది. పవన్ గుప్తా వేసిన క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్  కోవింద్ నిన్న రిజక్ట్ చేశారు. మిగతా దోషులు ఇప్పటికే తమకున్న న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకున్నారు. దీంతో ప్రస్తుతం దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలు ముగిసాయి. క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించిన 14 రోజుల తర్వాతే దోషులకు శిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారమే మార్చి 20 కొత్త డెత్ వారెంట్ ఇచ్చింది పటియాలా హౌస్ కోర్టు. దోషులకు అన్ని అవకాశాలు పోవడంతో ఈసారి ఉరిశిక్ష అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

జనవరి 22నే దోషులను ఉరితీయాల్సి ఉండగా.. ముకేశ్  క్షమాభిక్ష పిటిషన్  వేయడంతో వాయిదా పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరితీయాల్సి ఉండగా.. దీనికి రెండు రోజుల ముందు జనవరి 30న దోషులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే వరకు ఉరిశిక్షపై స్టే విధించాలని అభ్యర్థించారు. దీనికి కోర్టు అంగీకరించడంతో ఉరి అమలు రెండోసారి వాయిదా పడింది. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీయాలని  మూడో సారి డెత్ వారెంట్ ఇచ్చింది పటియాలా కోర్టు. అయితే చివరి నిమిషంలో పవన్ గుప్తా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకోవడంతో మళ్లీ వాయిదా పడింది.