ఊపిరి పీల్చుకుంటున్న తెలంగాణ : మోస్తారు వర్షాలే.. హైదరాబాద్ కు నో అలర్ట్

ఊపిరి పీల్చుకుంటున్న తెలంగాణ :  మోస్తారు వర్షాలే.. హైదరాబాద్ కు నో అలర్ట్

రాష్ట్రంలో ఇవాళ ( 2023 జూలై28) తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ వెల్లడించింది.  7 జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని అదిలాబాద్, నిర్మల్,కొమరం భీమ్, మంచిర్యాల జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.   

హైదరాబాద్ లో మాత్రం  తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.   గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.  వరుణదేవా ఇక చాలు కరుణించు అంటూ ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మోస్తారు  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ చెప్పడంతో కాస్త ఊపిరి పిల్చుకుంటున్నారు.  

బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జలవిలయం సృష్టించాయి.  రాష్ట్రవ్యాప్తంగా 14 మంది మృతి చెందగా ,  మరో 20 మందికిపైగా గల్లంతయ్యారు. 40 వేల కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డునపడ్డాయి. పది వేల మంది పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. 

 ఉత్తర తెలంగాణ జిల్లాలను వర్షాలు  అతలాకుతలం చేశాయి. భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, కొత్తగూడెం జిల్లాలు ఆగమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పెద్దసంఖ్యలో చెరువులు,  రోడ్లు తెగిపోయి, వందలాది గ్రామాలతోపాటు పట్టణాల్లోని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదిలాబాద్​,  ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, కరీంనగర్​ జిల్లాల్లోనూ అతి భారీ వర్షం కురిసింది.