నిధుల్లేవ్.. నియామకాల్లేవ్. అధ్వానంగా ఓయూ

నిధుల్లేవ్.. నియామకాల్లేవ్. అధ్వానంగా ఓయూ
  • సర్కారు ఇస్తున్న నిధులు జీతాలకే సరిపోని దుస్థితి
  • సగానికిపైగా టీచింగ్‌‌  పోస్టులు ఖాళీ
  • రెగ్యులర్​ వీసీ లేడు.. పాలకమండలీ లేదు
  • ఫెలోషిప్​లందవు.. పరిశోధనల్లేవ్​
  • కబ్జా కోరల్లో వర్సిటీ భూములు

దేశంలోని ప్రతిష్టాత్మక వర్సిటీల్లో ఒకటైన ఉస్మానియా నిధులు, నియామకాలు లేక ఆగమవుతోంది. స్టూడెంట్లు, బ్రాంచీల సంఖ్యకు తగినట్టుగా ఫ్యాకల్టీ లేరు, అసలు రెగ్యులర్ వీసీనే లేరు. కొత్త భవనాల్లేవు.. స్టూడెంట్లకు ఫెలోషిప్లు లేవు.. రీసెర్చ్లకు ప్రోత్సాహమే లేదు.. సర్కారు ఇస్తున్న నిధులు ఉన్న సిబ్బంది జీతాలకే సరిపోవడం లేదు.

హైదరాబాద్‌‌, వెలుగు:

ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం 1,267 టీచింగ్‌‌ ఫ్యాకల్టీ పోస్టులున్నాయి. అందులో 470 మంది మాత్రమే రెగ్యులర్‌‌  ఫ్యాకల్టీ ఉన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో మరికొందరు పనిచేస్తున్నారు. 415 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి 2017లో ప్రభుత్వం అనుమతించినా అది ప్రకటనకే పరిమితమైంది. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. రిజర్వేషన్ల అంశంతో పోస్టుల భర్తీని తొలుత పెండింగ్‌‌ పెట్టిన సర్కారు.. ఆ సమస్య పరిష్కారమైనా భర్తీ గురించి పట్టించుకోవడం లేదు. 2005 నుంచి రిటైరైన ప్రొఫెసర్‌‌, అసోసియేట్‌‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌  పోస్టుల భర్తీపైనా దృష్టి పెట్టలేదు. టీచింగ్‌‌ ఫ్యాకల్టీ లేకపోవడంతో దాని ప్రభావం వర్సిటీ ప్రమాణాలపై పడుతోందని స్టూడెంట్స్​ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • 54 డిపార్‌‌మెంట్లకుగాను 10కిపైగా డిపార్ట్​మెంట్లలో ప్రొఫెసర్లు లేరు.
  • ఫ్రెంచ్‌‌, జర్మన్‌‌, రష్యన్‌‌, తమిళ్‌‌, థియేటర్‌‌ ఆర్ట్స్‌‌, ఫుడ్‌‌ అండ్‌‌ న్యూట్రిషియన్‌‌ (హోంసైన్స్‌‌) తదితర డిపార్ట్‌‌మెంట్లలో ఒక్క రెగ్యులర్‌‌  ఉద్యోగి కూడా లేకపోవడం గమనార్హం.
  • సిద్దిపేట ఓయూ పీజీ కాలేజీ పరిధిలోని ఇంగ్లిష్‌‌, జర్నలిజం, ఎకనామిక్స్‌‌.. జోగిపేట ఓయూ పీజీ కాలేజీలోని ఇంగ్లిష్‌‌, బిజినెస్‌‌ మేనేజ్మెంట్‌‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌‌, లైబ్రరియన్‌‌ అండ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ అండ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ సైన్స్‌‌ డిపార్ట్​మెంట్లలో.. నర్సాపూర్‌‌ ఓయూ పీజీ కాలేజీలోని ఎమ్మెస్సీ ఆర్గానిక్  కెమిస్ట్రీ, మేథమెటిక్స్ ఎంబీఏ, ఎంసీజే తదితర డిపార్ట్మెంట్లలో ఒక్కరూ రెగ్యులర్‌‌ ప్రొఫెసర్లు లేరు.
  • నాన్‌‌ టీచింగ్‌‌ పోస్టులూ పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఓయూ పరిధిలో మొత్తం 2,428 మంది పర్మినెంట్‌‌ ఎంప్లాయీస్‌‌ పనిచేస్తుండగా.. 1,202 మంది టెంపరరీ ఉద్యోగులు ఉన్నారు.
  • పాలక మండలి లేకుండానే మూడు, నాలుగేండ్ల నుంచి వర్సిటీ కొనసాగుతోంది. దాంతో పూర్తిస్థాయిలో వర్సిటీ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు.
  • జులై 24 నుంచి వర్సిటీ వీసీ పోస్టు కూడా ఖాళీగానే ఉండటంతో ఇన్‌‌చార్జ్​వీసీ పాలనలోనే కొనసాగుతోంది.

జీతాలకే సరిపోని నిధులు

ఓయూ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. స్టేట్‌‌లో పెద్ద యూనివర్సిటీ అయిన ఓయూకు బడ్జెట్​లో నామమాత్రపు కేటాయింపులే దక్కుతున్నాయి. ఆ నిధులు వర్సిటీ సిబ్బంది వేతనాలు, పింఛన్లకు కూడా సరిపోవడం లేదు. గత ఐదేండ్లలో ఏనాడూ వర్సిటీ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పట్టించుకోలేదని అధికారులు చెప్తున్నారు. 2019–20 ఏడాదికి గాను రూ.700 కోట్లు ఇవ్వాలని వర్సిటీ కోరితే.. ఓటాన్‌‌ అకౌంట్లో రూ. 355 కోట్లు ఇస్తామని చూపారు. ఇటీవల పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్​లో అయితే మరింత కోత వేసి రూ. 309.53 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం జీతాలు, పింఛన్లు, ఇతర మెయింటెన్స్‌‌ కోసమే రూ.458 కోట్లు అవసరమని అధికారులు చెప్తున్నారు. ఏటా అడిషనల్‌‌ గ్రాంట్లు ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం.. ఆ మాటను నిలుపుకోవడం లేదు. ఫలితంగా స్టూడెంట్స్ నుంచి వచ్చే ఫీజులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగ్జామినేషన్‌‌ బ్రాంచ్‌‌, డిస్టెన్స్‌‌ ఎడ్యుకేషన్‌‌, యూఎఫ్‌‌ఆర్‌‌వో విభాగం, పీజీ అడ్మిషన్స్‌‌ వింగ్‌‌ల నుంచి వస్తున్న ఆదాయమే వర్సిటీని గట్టెక్కిస్తున్నాయి. వర్సిటీ నిజాం కాలేజీ, ఇంజినీరింగ్‌‌ కాలేజీ, మహిళా కాలేజీల నుంచి అప్పులు తీసుకొని పరిస్థితులను నెట్టుకురావాల్సి వస్తోందని ఓయూ అధికారులు చెప్తున్నారు.

వందల ఎకరాలు కబ్జా..

వర్సిటీని స్థాపించినప్పుడు నిజాం రాజు 2,400 ఎకరాల స్థలం ఇచ్చారు. తర్వాత అందులో చాలా భూమి కబ్జాల పాలైంది. సగం భూమి కూడా వర్సిటీ పరిధిలో లేదని అంచనా. అయితే ప్రస్తుతం ఓయూ పరిధిలో 1,300 ఎకరాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.

పరిశోధనలకు ప్రోత్సాహమేది?

ఓయూ పరిధిలో సుమారు మూడు వేలమంది వరకూ పీహెచ్‌‌డీ స్కాలర్స్‌‌ ఉన్నారు. కానీ వర్సిటీలో పరిశోధనలకు పెద్దగా ప్రోత్సాహం లేకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఫెలోషిప్స్‌‌ కూడా అందడం లేదు. గతంలో యూజీసీ నుంచి డిపార్ట్‌‌మెంట్లలో మెరిట్‌‌ స్టూడెంట్స్​కు నామినేటెడ్‌‌ ఫెలోషిప్‌‌ కింద ఒక్కొక్కరికీ నెలకు రూ.8 వేలు అందేవి. కానీ రెండేండ్ల నుంచి అవి కూడా రావడం లేదు. గతంలో ఓబీసీ, మైనార్టీ,ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్‌‌గాంధీ నేషనల్‌‌  ఫెలోషిప్‌‌  వచ్చేది. కులాలవారీగా ఫెలోషిప్‌‌ల పేర్లను నాలుగేండ్ల క్రితం మార్చారు. కానీ మూడేండ్ల నుంచి ఎస్సీ,ఓబీసీ, మైనార్టీ స్కాలర్స్‌‌కు ఫెలోషిప్​ రావడం లేదు. దాంతో పరిశోధనలు చేసేందుకు స్కాలర్స్‌‌  ఇబ్బంది పడుతున్నారు. వర్సిటీ నుంచి ప్రత్యేకంగా స్కాలర్స్‌‌  ఫెలోషిప్‌‌ ఇస్తామని వందేండ్ల ఓయూ ప్రోగ్రాంలో వర్సిటీ అధికారులు హామీ ఇచ్చినా.. అది అమలుకు నోచుకోవడం లేదు.

అడుగుపెట్టేందుకు నేతల భయం

తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉంది. వర్సిటీలోని ప్రొఫెసర్లతో పాటు స్టూడెంట్స్‌‌, సిబ్బంది మొత్తం ఉద్యమంలో పాల్గొన్నారు. ఓయూ విద్యార్థుల పోరాట స్ఫూర్తి తెలంగాణకు దిక్సూచిగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి ఓయూ గురైందని, తెలంగాణ వస్తే ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకులు.. ఇప్పుడు వర్సిటీవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. వందేండ్ల ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ బందోబస్తుతో ఓయూకు వచ్చిన సీఎం కేసీఆర్‌‌.. ఏం మాట్లాడకుండానే వెనుదిరిగారు. ఐదేండ్ల కాలంలో ఒకరిద్దరు మినిస్టర్స్‌‌ అలా వచ్చి వెళ్లిపోయారే తప్ప ఓయూ సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు. వర్సిటీ పరిస్థితిపై స్టూడెంట్స్​ నుంచి వ్యతిరేకత రావొచ్చన్న భయమే దీనికి కారణమన్న వాదన వినిపిస్తోంది.

కొత్త హాస్టళ్లేవి?

ఓయూ పరిధిలో 18 హాస్టళ్లు ఉన్నాయి. సగానికిపైగా హాస్టళ్లు ఎన్నో ఏండ్ల క్రితం నాటివే. పీహెచ్‌‌డీ స్కాలర్లు ఉండే ఎన్‌‌ఆర్‌‌ఎస్‌‌  హాస్టల్‌‌లో వంద మంది ఉండాలి కానీ 250 మందికి పైగా ఉంటున్నారు. మిగతా హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి. వర్సిటీలో స్టూడెంట్స్, పీహెచ్‌‌డీ స్కాలర్స్ సంఖ్య పెరుగుతున్నా.. దానికి అనుగుణంగా హాస్టల్స్‌‌ పెంచడం లేదు. వందేండ్ల ఉత్సవాల సందర్భంగా ఏడు హాస్టల్స్‌‌ నిర్మిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికి ఒక్కటి మాత్రమే నిర్మించారు. అది కూడా అందుబాటులోకి రాలేదు. లేడీస్ హాస్టల్స్‌‌లో టాయ్‌‌లెట్​ సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. ఓయూలో పాలకమండలి లేకపోవడంతో ఏ చిన్న అవసరమొచ్చినా వర్సిటీ అధికారులు సెక్రటేరియెట్‌‌ చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. వర్సిటీపై ఐఏఎస్‌‌ల పెత్తనం పెరిగిపోయిందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

కబ్జాలో 400 ఎకరాలు

ఓయూ భూములకు రక్షణ లేకుండా పోయింది. సుమారు 400 ఎకరాల స్థలాన్ని టీఆర్ఎస్‌‌  నేతలు కబ్జా చేశారు. ఇప్పటికీ నిజాం కట్టిన గుర్రపుషెడ్స్‌‌లోనే స్టూడెంట్స్​ ఉంటున్నారు. బిల్డింగ్​లే కాదు, బాత్‌‌రూమ్​లు కూడా లేక అవస్థలు పడుతున్నారు. వందేండ్ల చరిత్ర ఉన్న ఓయూకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ సర్కార్‌‌ అంధకారంలోకి నెట్టేస్తోంది. ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నా నింపడం లేదు. దమ్మూధైర్యం ఉంటే సీఎం కేసీఆర్‌‌, విద్యా శాఖ మంత్రి ఓయూకు వచ్చి, సమస్యలు తెలుసుకోవాలి.- అయ్యప్ప, ఏబీవీపీ జాతీయ నేత

స్టూడెంట్స్​పై సర్కారు కక్ష

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఓయూ స్టూడెంట్స్​పై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. దీంతో వర్సిటీ అకడమిక్‌‌ వాతావరణం దెబ్బతింటోంది. అనేక హాస్టళ్లు శిథిలావస్థకు చేరినా, వాటిని బాగుచేసే వారే కరువయ్యారు. మెస్‌‌చార్జీలు నెలకు రూ.1,500 ఇస్తుండగా, స్టూడెంట్స్​ ఏటా మరో రూ.20 వేలు అదనంగా భరించాల్సి వస్తోంది. స్టూడెంట్స్​ సంక్షేమం గురించి పట్టించుకోని ప్రభుత్వం.. సీసీ కెమెరాల కోసమంటూ రూ. 2 కోట్లు ఖర్చుపెట్టింది.- ఆర్‌‌ఎల్‌‌ మూర్తి, ఎస్‌‌ఎఫ్‌‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు

పోలీస్​ క్యాంపుగా మార్చారు

వర్సిటీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టి పోలీస్‌‌క్యాంపుగా మార్చేశారు. సమస్యల గురించి ప్రశ్నించే స్టూడెంట్స్​పై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే ఓయూ బాగుపడుతుందని ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నాం. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడే సమస్యలు ఎక్కువయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్సిటీలో ఒక్క ప్రొఫెసర్‌‌ను కూడా నియమించలేదు. దీంతో పరిశోధనలు సక్రమంగా జరగడం లేదు.- ఆర్‌‌ఎన్‌‌ శంకర్‌‌, ఏఐఎస్‌‌ఎఫ్‌‌ స్టేట్‌‌ ఆర్గనైజింగ్‌‌ సెక్రెటరీ

no funds and no postings in osmania university