మైనార్టీలకు చేసిందేమీ లేదు

మైనార్టీలకు చేసిందేమీ లేదు
  • 804 జీవోలిచ్చి ఒక్క పైసా ఇయ్యలే
  • పాతబస్తీ.. ఇస్తాంబుల్​ ఎప్పుడైతది?: అక్బరుద్దీన్

హైదరాబాద్​, వెలుగు: మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎంఐఎం ఫ్లోర్​ లీడర్​ అక్బరుద్దీన్​ ఒవైసీ మండిపడ్డారు. ముస్లింల సంక్షేమ కోసం 804 జీవోలు ఇచ్చినా.. అందులో ఒక్క రూపాయి కూడా రిలీజ్​ చేయలేదని దుయ్యబట్టారు. పాతబస్తీ.. ఇస్తాంబుల్​ లెక్క ఎప్పుడైతదని నిలదీశారు. ముస్లింల కోసం అసెంబ్లీ వేదికగా తాను అరుస్తూనే ఉన్నానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానని, అయినా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తలేదని,  తన కడుపు మండుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదని, ఉన్నన్ని రోజులు ముస్లింల శ్రేయస్సు కోసమే కృషి చేస్తూ ఉంటానని అక్బరుద్దీన్​ చెప్పారు. మైనార్టీల సంక్షేమం, హైదరాబాద్​లోని పాతబస్తీ అభివృద్ధిపై అసెంబ్లీలో సోమవారం షార్ట్​ డిస్కషన్​ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ... ఇటీవల నియమించిన యూనివర్సిటీల వీసీల్లో, తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ సభ్యుల్లో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. పబ్లిక్​ ప్రాసిక్యూటర్స్​గా, గవర్నమెంట్​ ప్లీడర్లుగా అర్హులైన ముస్లింలను ఎందుకు నియమిస్తలేరని ఆయన ప్రశ్నించారు. అబద్ధపు హామీలు ఎందుకిస్తారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పాతబస్తీకి ఇంకా మెట్రో రైలు రాలేదు. హైదరాబాద్ అంతా మెట్రో నడుస్తుంది కానీ పాతబస్తీ అనంగనే పర్యావరణ అనుమతి అడ్డు వస్తుందా?” అని నిలదీశారు. పాతబస్తీకి బస్సులు కూడా సరిగ్గా రావడం లేదన్నారు. మైనార్టీల సబ్సిడీ లోన్లకు సంబంధించి 1.50 లక్షల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయని, స్టూడెంట్లకు రావాల్సిన స్కాలర్​షిప్​లు కూడా పెండింగ్​లోనే పెట్టారని మండిపడ్డారు. వక్ఫ్​ బోర్డులో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రెసిడెన్షియల్​ స్టడీ సర్కిల్స్​ ఏర్పాటు చేయాలని అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఓల్ట్​ సిటీలో అన్నపూర్ణ క్యాంటీన్లు, నైట్​ షెల్టర్స్​ పెంచాలని ఆయన డిమాండ్​ చేశారు. 
ఇన్​కం సీలింగ్​ ఎందుకు?
ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్ల కోసం రూ. 8 లక్షల వరకు సీలింగ్​ పెట్టారని.. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రం అర్బన్​లో రూ. 2 లక్షలు, రూరల్​లో రూ. 1.50 లక్షలు పెట్టారని, అందరికి సమ న్యాయం ఉండాలని, ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతోందని అక్బరుద్దీన్​ ప్రశ్నించారు. ఇన్​కం సీలింగ్​ అందరికీ రూ. 8 లక్షలకు పెంచాలన్నారు. ఇమామ్​లు, మౌజంలకు 6 నెలల నుంచి డబ్బులు ఇవ్వట్లదని, ఇంకా 5 వేల మంది ఇమామ్​లు, మౌజంల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయని, వాటిని క్లియర్​ చేయాలని డిమాండ్​ చేశారు. హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్ లో ముస్లింలకు రిజర్వేషన్​ కల్పించాలన్నారు. వక్ఫ్​బోర్డు భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని, ఎంక్వైరీ చేయించాలని డిమాండ్​ చేశారు.