తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీలు నడిపేందుకు చర్చలు

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీలు నడిపేందుకు చర్చలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్చలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ( సోమవారం) హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో  రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సర్వీసులు ఎంత భూభాగంలో, ఏపీ బస్సులు తెలంగాణలో ఎంత వరకు తిరగాలని, ఎన్ని సర్వీసులు నడపాలి? ఎన్ని స్టాపులు కేటాయించాలి? అనే అంశాలపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ తో రెండు రాష్ట్రాల మధ్య సర్వీసులను నిలిపివేశారు. దాదాపు మూడునెలల పాటు బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.  ఈ క్రమంలో అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపితేనే సంస్థ మనుగడ సాధ్యమని, లాభాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన అధికారులు బస్సు సర్వీసులను పునరుద్ధరించే దిశగా చర్చలు జరుపుతున్నారు. సమావేశం గత నెలలోనే జరగాల్సి ఉండగా బస్‌ భవన్‌లో సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావడంతో సమావేశం వాయిదా పడింది. సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఈడీలు పురుషోత్తంరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, యాదగిరి, సీటీఎం ముణిశేఖర్‌ పాల్గొన్నారు.