19 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్

19 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 19 రాష్ట్రాలు, యూటీలకు పాకింది. ఆదివారం మధ్యప్రదేశ్, హిమాచల్​ప్రదేశ్​లోనూ ఫస్ట్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​కు వివిధ దేశాల నుంచి వచ్చిన 8 మందికి, హిమాచల్​లో కెనడా నుంచి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ కన్ఫమ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఒడిశాలో 4, ఏపీలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 430కి చేరువైంది. సౌత్ ఆఫ్రికా నుంచి హైదరాబాద్ మీదుగా ఒంగోలుకు వచ్చిన 48 ఏండ్ల వ్యక్తికి, బ్రిటన్ నుంచి బెంగళూరు మీదుగా అనంతపురానికి వచ్చిన 51 ఏండ్ల వ్యక్తికి కొత్త వేరియంట్ సోకింది. దీంతో ఆంధ్రప్రదేశ్​లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు పెరిగింది. ఇండోర్​లో ఒమిక్రాన్ బారిన పడినవాళ్లలో ఆరుగురు ఆల్రెడీ కోలుకుని, ఇండ్లకు వెళ్లారని స్టేట్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇటీవల విదేశాల నుంచి ఇండోర్​కు 3 వేల మంది వచ్చారని, వీరిలో 26 మందికి కరోనా సోకిందన్నారు. దేశంలో ఇప్పటివరకు 130 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నారని ఆదివారం ఉదయం కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108, ఢిల్లీలో 79, గుజరాత్​లో 43, తెలంగాణలో 41, కేరళలో 38, తమిళనాడులో 34, కర్నాటకలో 31 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 

మరో 6,987 మందికి కరోనా 
దేశంలో మరో 6,987 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,86,802కు పెరిగిందని ఆదివారం ఉదయం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. మరో 162 మంది చనిపోయారని, మొత్తం మృతుల సంఖ్య 4,79,682కు పెరిగినట్లు పేర్కొంది. యాక్టివ్ కేసులు 76,766కు తగ్గాయని, మొత్తం కేసుల్లో ఇవి 0.22% ఉన్నాయని వెల్లడించింది. అలాగే దేశంలో 18 ఏండ్లు నిండినోళ్లలో 61 శాతం మందికి రెండు డోసులు, 90 శాతం మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్రం తెలిపింది. ఆదివారం ఉదయం 7 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 32,92,766 డోసుల టీకాలు వేశారని, మొత్తం డోసుల సంఖ్య 141.37 కోట్లకు చేరిందని పేర్కొంది. 

మహారాష్ట్రలో 52 మంది స్టూడెంట్లకు.. 
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా టక్లీ ధోకేశ్వర్​లోని జవహర్ నవోదయ స్కూల్​లో 52 మంది స్టూడెంట్లకు కరోనా సోకింది. స్కూల్​లోని మొత్తం 450 మంది స్టూడెంట్లకు టెస్టులు చేయగా, 52 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో స్కూల్ ను మూసివేసిన అధికారులు ఆ ఏరియాను కంటైన్ మెంట్ జోన్​గా ప్రకటించారు.

సెకండ్ డోస్ తర్వాత.. 9-12 నెలలకు బూస్టర్ డోస్
ఒమిక్రాన్ వ్యాపిస్తున్నందున హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, కోమార్బిడిటీస్ సమస్యలు ఉన్నవాళ్లకు జనవరి 10 నుంచి ప్రికాషన్ డోస్ (బూస్టర్ డోస్ లేదా థర్డ్ డోస్) టీకాలు ప్రారంభిస్తామని ప్రధాని మోడీ శనివారమే ప్రకటించారు. అయితే, కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత.. థర్డ్ డోస్ తీసుకునేందుకు సుమారు 9 నుంచి 12 నెలల గ్యాప్ అవసరం ఉంటుందని ఆదివారం కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. దీనిపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) నిపుణులు చర్చిస్తున్నారని, కచ్చితంగా సెకండ్ డోస్ కు, బూస్టర్ డోస్ కు మధ్య ఎంత గ్యాప్ ఉండాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.