టెక్నికల్ కాలేజీల్లో ‘థంబ్’ లెక్చరర్లు

టెక్నికల్ కాలేజీల్లో ‘థంబ్’ లెక్చరర్లు
  • ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఉత్తుత్తి లెక్చరర్లు 
  • పైసలు మిగుల్చుకునేందుకు మేనేజ్​మెంట్ల కొత్త ప్లాన్​
  • పైసలిచ్చి ఫేక్​ఫ్యాకల్టీతో బయోమెట్రిక్ హాజరు

ఇబ్రహీంపట్నంలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ ​కాలేజీలో 160 మందికి పైగా లెక్చరర్లు ఉన్నారు. వీరిలో 50 మందికి పైగా లెక్చరర్లు కాలేజీలో ఉండరు.. పాఠాలు చెప్పరు. ఉదయం, సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి పోతుంటారు. మేనేజ్​మెంట్ వారికి  నెలకు రూ.10 వేల చొప్పున ఇస్తోంది. టెక్నికల్ ​కాలేజీల్లో పూర్తి స్థాయి ఫ్యాకల్టీ ఉండాలని ఏఐసీటీఈ, యూనివర్సిటీలు పెట్టిన రూల్స్​తప్పించుకోడానికి.. మెజార్టీ కాలేజీల మేనేజ్​మెంట్లు ఇలా.. థంబ్ ​లెక్చరర్ల విధానానికి తెర లేపాయి.

హైదరాబాద్, వెలుగు: టెక్నికల్ ​కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ​కోసం ఏఐసీటీఈ, యూనివర్సిటీలు పెడ్తున్న రూల్స్​ను మేనేజ్​మెంట్లు పట్టించుకోవడం లేదు. ఖర్చు తగ్గించుకునేందుకు కొత్త దారి వెతుకుతున్నాయి. రాష్ట్రంలో 530కి పైగా ప్రైవేటు టెక్నికల్ కాలేజీలుండగా వాటిల్లో 40 వేలకు పైగా టీచింగ్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. రూల్స్​ ప్రకారం ఒక్కో టెక్నికల్​ కాలేజీలో డిపార్ట్​‌‌‌‌మెంట్​కు ఒక ప్రొఫెసర్‌‌‌‌, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌‌‌‌ సహా కనీసం 80 మందికి తగ్గకుండా ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఒక్క కాలేజీలోనూ ఫ్యాకల్టీ లేరు. దీనిపై విమర్శలు రావడంతో ఏఐసీటీఈ గైడ్​లైన్స్​ప్రకారం.. వర్సిటీలు కాలేజీల్లో ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయడంతో ఫ్యాకల్టీని పెట్టుకోవాల్సి వచ్చింది.  ఖర్చు తగ్గించుకునేందుకు కొంత మంది ఫ్యాకల్టీనే నియమించుకున్న మేనేజ్​మెంట్లు.. తమ కాలేజీల్లో పూర్తి స్థాయి ఫ్యాకల్టీ ఉందని చూపించేందుకు.. థంబ్​ లెక్చరర్ల విధానం తీసుకొచ్చింది. 

థంబ్ వేసిపోతే పది వేలు..
ప్రస్తుతం దాదాపు మెజార్టీ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో థంబ్ ఫ్యాకల్టీ విధానం నడుస్తోంది. ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేసిపోతున్న థంబ్​  లెక్చరర్లకు ఆయా మేనేజ్​మెంట్లు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల చొప్పున ఇస్తున్నాయి. వీరంతా వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ, మేనేజ్​మెంట్లు ఇచ్చే రెమ్యునరేషన్ కోసం ఇలా హాజరు వేసిపోతుంటారు.

స్టూడెంట్లకు నష్టం..
టెక్నికల్​ కాలేజీల మేనేజ్​మెంట్లు పూర్తి స్థాయిలో రెగ్యులర్ ఫ్యాకల్టీని పెట్టుకుంటే ఒక్కో లెక్చరర్​కు నెల నెలా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఖర్చు తగ్గించుకోవడం కోసం.. థంబ్​లెక్చరర్ల విధానం నడిపిస్తుండటంతో స్టూడెంట్లకు నష్టం జరుగుతోంది. ఉన్న ఫ్యాకల్టీతోనే రెండు నుంచి మూడు క్లాసులు చెప్పిస్తుండటంతో క్వాలిటీ దెబ్బతింటోంది. ల్యాబ్​లనూ వేరే కొత్తవారితో చేయిస్తున్నారు. 

తనిఖీలు చేపట్టాలె 
ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్​ హాజరు విధానంపై వర్సిటీ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలె. రెగ్యులర్​ఫ్యాకల్టీని పెట్టుకోకుండా.. థంబ్​లెక్చరర్లతో నడిపిస్తున్న కాలేజీలను గుర్తించాలి. కొన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలైతలేదు. జేఎన్టీయూ, ఓయూతో పాటు అన్ని వర్సిటీలు ఇలాంటి ఫేక్ ఫ్యాకల్టీని గుర్తించి చర్యలు తీసుకోవాలె. - సంతోష్​కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎస్​టీసీఈఏ