నిన్నటి వరకు కొట్లాడిన ప్రతిపక్షాలు.. నేడు మద్దతు

నిన్నటి వరకు కొట్లాడిన ప్రతిపక్షాలు.. నేడు మద్దతు
  • రాజ్యాంగ సవరణ బిల్లు: కేంద్రానికి ప్రతిపక్షాల మద్దతు

న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్, అగ్రి చట్టాలపై చర్చకు డిమాండ్​ చేస్తూ పార్లమెంట్ వర్షాకాల  సమావేశాలు మొదలైన నాటి నుంచి ప్రతిపక్షాలు రోజూ సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో నిత్యం వాయిదాల పర్వమే నడుస్తోంది. రోజూ కేంద్రంతో కొట్లాడుతున్న ప్రతిపక్షాల తీరులో ఇవాళ మార్పు వచ్చింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ సర్కారుకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఓబీసీ బిల్లు పాస్ అయ్యేందకు సహకరిస్తామని తెలిపాయి. ఓబీసీ కులాల జాబితాలో మార్పులు చేసుకునేందుకు రాష్ట్రాలకే అవకాశం కల్పించేలా రాజ్యాంగ సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో..

మే నెలలో సుప్రీం కోర్టు మరాఠా రిజర్వేషన్ల అంశంపై తీర్పు ఇచ్చిన సందర్భంగా చేసిన కామెంట్స్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణకు సిద్ధపడింది. మరాఠాలను బీసీల్లో చేరుస్తూ మహారాష్ట్ర సర్కారు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంతో దానిని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఓబీసీ కులాల జాబితాలోకి కొత్త కులాలు చేర్చాలన్నా, ఉన్న వాటిని తొలగించాలన్నా రాష్ట్రాలకు అధికారం లేదని, కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఆ హక్కు ఉందని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు ఈ హక్కు కల్పించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో సవరణ చేసేందుకు చర్యలు తీసుకుంది. దీని కోసం రూపొందించిన బిల్లును ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

రాజ్యాంగ సవరణకు ప్రతిపక్షాల మద్దతు తప్పదు

‘‘రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ సరిపోదు. ఉభయ సభల్లోనూ రెండింట మూడొంతుల మెజారిటీ ఉంటేనే బిల్ పాస్ అవుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు  చాలా ముఖ్యమైన అంశం. ఈ బిల్లు పాస్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీల లిస్టులో మార్పులు చేసుకునే అవకాశం కలుగుతుంది. అందుకే మేం కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని నిర్ణయించాం. అయితే మేం బీసీ జనగణన చేయాలని కూడా డిమాండ్ చేస్తాం” అని ఆర్జేడీ పార్టీ ఎంపీ మనోజ్ సిన్హా చెప్పారు. ఇతర పార్టీలు కూడా ఈ బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నాయని అన్నారు.