లక్నోలో మసీదుల పేరుతో కరోనా హాట్ స్పాట్లు

లక్నోలో మసీదుల పేరుతో కరోనా హాట్ స్పాట్లు
  • యోగీ ప్రభుత్వం పై ప్రతిపక్షాల ఫైర్

లక్నో : యూపీ లోని లక్నో లో 18 కరోనా హాట్ స్పాట్లను గుర్తించగా అందులో 8 మసీదుల పేర్లు ఉన్నాయి. లక్నో 8 మసీదులను హాట్ స్పాట్లు గా గుర్తిస్తూ వాటి పేర్లను యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆయా మసీదులు ఉన్న ప్రాంతాలకు ఏరియా పేర్లు ఉన్నప్పటికీ మసీదుల పేర్లనే హాట్ స్పాట్లుగా ప్రకటించింది. అలీజాన్ మసీదు, ముహమ్మదీయ మసీదు, ఖజూర్ వాలీ మసీదు, నజర్ బాగ్ మసీదు ఇలా 8 మసీదులను కరోనా హాట్ స్పాట్లు గా గుర్తించినట్లు తెలిపారు. హాట్ స్పాట్ల పేర్లను మసీదుల పేర్లతో ప్రకటించటం తో రాజకీయ దుమారం మొదలైంది. కరోనా వైరస్ కు మతం రంగును పులుముతున్నారంటూ యూపీ లోని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మసీదుల పేరుతో కరోనా హాట్ స్పాట్లు ప్రకటించటం దురదృష్టమంటూ యూపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా హాట్ స్పాట్లను మతం పేరు పెట్టి ప్రజలను విడదీస్తున్నారంటూ ఎస్పీ నేత రాజ్ పాల్ కశ్యప్ విమర్శించారు. కరోనా సంక్షోభంలోనూ బీజేపీ రాజకీయ ప్రయోజనాల వెతుక్కుంటుందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.