’పోతిరెడ్డిపాడు’పై సుప్రీంకు పాలమూరు రైతులు

’పోతిరెడ్డిపాడు’పై సుప్రీంకు పాలమూరు రైతులు

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం తలపెట్టిన సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణపై ఉమ్మడి పాలమూరు రైతులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎన్జీటీలో కేసు వేసిన నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్ తో పాటు మరికొందరు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయనున్నారు. సుప్రీంలో కేసు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లను అడ్వొకేట్ శ్రావణ్ కుమార్ ఇప్పటికే మొదలుపెట్టారు. సంగమేశ్వరం లిఫ్ట్ స్కీంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం దాదాపు చేతులెత్తేసిన పరిస్థితిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ టెక్నికల్ అప్రైజల్ లేకుండా ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం టెండర్లకు సిద్ధపడటం, టెండర్లకు సంబంధించిన కాపీలను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపడంపై సుప్రీంకోర్టులో కేసు వేయనున్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంగమేశ్వరం ప్రాజెక్టు టెండర్లకు ఎన్జీటీ ఓకే చెప్పడాన్ని సుప్రీంలో సవాల్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని, హైదరాబాద్ తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని, వీటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్జీటీ టెండర్లకు ఓకే చెప్పిందని పిటిషనర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణ తెలంగాణ హక్కులు కాపాడటానికి న్యాయపోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు.

రైతులంతా అభ్యంతరాలు చెప్పండి: గవినోళ్ల

ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూకు తాము అభ్యంతరాలను కూడా పంపినట్లు పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ చెప్పారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుల వల్ల దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అభ్యంతరం చెప్పామని, ఈ ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరామని ఆయన తెలిపారు. రాష్ట్రం నుంచి సర్పంచులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్ సైట్ లో తమ అభ్యంతరాలను ఫైల్ చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కోసం రైతులంతా Judge-jpp@ap.gov.in, apjudicialpreview@gmail.com ఈ-మెయిల్ ఐడీలకు తమ అభ్యంతరాలను పంపాలని కోరారు