ఆయన టెర్రరిస్ట్ కాదు.. నిజమైన దేశ భక్తుడు

ఆయన టెర్రరిస్ట్ కాదు.. నిజమైన దేశ భక్తుడు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని మెజారిటీతో దూసుకెళ్తోంది. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అంటూ ఆప్ నేతలంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయంపై ఆ పార్టీ నేత, రాజిందర్ నగర్ నుంచి విజయం సాధించిన కేండిడేట్ రాఘవ్ చద్దా స్పందించారు. ఢిల్లీ ప్రజలు తమ కొడుకు లాంటి కేజ్రీవాల్‌ను మరోసారి ఆదరించారని అన్నారు. దేశ నిర్మాణం కోసం పని చేస్తున్న ఆయనను గెలిపించారని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు కొందరు కేజ్రీవాల్‌ను టెర్రరిస్టు అనడంపై రాఘవ్ చద్దా స్పందించారు. ఢిల్లీ ప్రజల తీర్పే దానికి సమాధానమని అన్నారు. ఆయన టెర్రరిస్టు కాదని, నిజమైన దేశ భక్తుడని ఢిల్లీ ప్రజలు నిరూపించారని చెప్పారు. దేశ భక్తిని ప్రేరేపించే పనులనే కేజ్రీవాల్ చేస్తున్నారని అన్నారు. బీజేపీ చేస్తున్న పనులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు రాఘవ్ చద్దా.

ఫిబ్రవరి 8న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. నేడు ఫలితాల్లో ఆమ్ ఆద్మీ తిరుగులేని విజయం దిశగా ముందుకెళ్తోంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో దాదాపు 60కి పైగా సీట్లలో ఆప్ లీడింగ్‌లో ఉంది. బీజేపీ ఏడెనిమిది సీట్లలో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ అసలు ఖాతా తెరవలేక బోల్తా పడింది.