ప్లాస్మా థెరపీతో కరోనా మరణాలను తగ్గించలేము: ICMR

ప్లాస్మా థెరపీతో కరోనా మరణాలను తగ్గించలేము: ICMR

కరోనా మరణాల రేటును తగ్గించడంలో ప్లాస్మా థెరపీ పెద్దగా ఉపయోగకరంగా లేదని భారత వైద్య పరిశోధన మండలి (ICMR )తెలిపింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 22 నుంచి జూలై 14 మధ్య 29 కరోనా చికిత్సా కేంద్రాల్లో 464 మందిపై పరిశోధన జరిపిన తర్వాత ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాకుండా ఈ ప్లాస్మా థెరపీ విధానం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కూడా అంతగా ప్రభావం చూపలేదని తెలిపింది. అయితే చికిత్సకు ముందు దాత, రోగిలో యాంటీబాడీల సంఖ్యను లెక్కించడంతో ఈ థెరపీ ప్రయోజనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పింది. కరోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడేందుకు ప్లాస్మా థెరపీ ఉపయోగకరంగా ఉంటుందని దేశ వ్యాప్తంగా బాగా ప్రచారం జరిగింది. దీనిపై  కొందరు నిపుణులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు కూడా చేయించాయి. కేంద్రం కూడా కొంత స్థాయిలో లక్షణాలున్న రోగులకు ప్లాస్మా థెరపీ చేయొచ్చని ప్రకటించింది. అయితే ప్లాస్మా థెరపీ ఉపయోగకరంగా లేదని ICMR రీసెర్చ్ లో తేల్చడంతో…కరోనాను అరికట్టవచ్చని ఇప్పటి వరకు ఉన్న నమ్మకం కూడా పోయిందంటున్నారు నిపుణులు.