మాదాపూర్ ఆడి కారు ఆక్సిడెంట్‌లో నమ్మలేని నిజం

మాదాపూర్ ఆడి కారు ఆక్సిడెంట్‌లో నమ్మలేని నిజం

ఈ నెల 27న మాదాపూర్‌లో జరిగిన ఆడి కారు ఆక్సిడెంట్‌లో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. కేసు నుంచి తన కొడుకును తప్పించేందుకు.. తమ కారు డ్రైవర్‌‌తో నిందితుడి తండ్రి బేరం కుదుర్చుకున్నట్లు బయటపడింది. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ఐకియా షోరూం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కాగా.. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను సైబరాబాద్ పోలీసులు రిలీజ్ చేశారు. వేగంగా వచ్చిన కారు ఆటోను వెనకునుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఉమేష్ అనే వ్యక్తి ఎగిరిపడి.. అక్కడికక్కడే చనిపోయాడు. ఉమేష్ మాదాపూర్‌లోని ప్రిస్మ్ పబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఓవర్ స్పీడ్‌తో ఆటోను కారు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కారును అక్కడే వదిలేసి వెళ్లాడు. కారులో బీర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతిగా మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదానికి కారణమైన సుజిత్ రెడ్డి, ఆషిష్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్‌లోని సృజనా హైస్కూల్ యజమాని రఘునాథ్ రెడ్డి పేరు మీద కారు రిజిస్ట్రర్ అయి ఉంది. 

కాగా.. కేసు నుంచి తన కొడుకును తప్పించేందుకు రఘునాథ్ రెడ్డి పోలీసులకు తన డ్రైవర్‌ ప్రభాకర్‌ను అప్పగించాడు. అయితే డ్రైవర్ కూడా ఈ ఆక్సిడెంట్ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ప్రభాకర్ వీరివద్ద గత 20 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చేయని నేరం తన మీద వేసుకునేందుకు డ్రైవర్ భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణలో డ్రైవర్.. అంతుచిక్కని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో నిజాన్ని చెప్పాడు.