సాగర్ ప్లాంట్ లో పోలీస్ ​పహారాతో విద్యుత్ ఉత్పత్తి

సాగర్ ప్లాంట్ లో పోలీస్ ​పహారాతో  విద్యుత్ ఉత్పత్తి


హాలియా/మేళ్లచెరువు, వెలుగు: నాగార్జునసాగర్​ పవర్​ప్లాంట్​లో పోలీసుల పహారా నడుమ విద్యుత్ ​ఉత్పత్తి కొనసాగుతోంది. కరెంటు ఉత్పత్తికి ఏపీకి చెందినవాళ్లు అవాంతరాలు సృష్టిస్తారనే అనుమానంతో మూడు రోజులుగా పోలీసులు సాగర్​లో బందోబస్తును కొనసాగిస్తున్నారు. శుక్రవారం సైతం తెలంగాణ పోలీసులు జెన్​కో ఆఫీసు ఎదుట భారీగా మోహరించారు. విద్యుత్​ ఉత్పాదన కేంద్రంలోకి వెళ్లే అధికారులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించారు. కొత్త వంతెన వద్ద ఉన్న తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు చెక్​పోస్టు వద్ద పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. మూడురోజులుగా ఇటు తెలంగాణ పోలీసులు, అటువైపు ఆంధ్రా పోలీసులు పహారా కాస్తున్నారు. తెలంగాణ వైపు డీఐజీ రంగనాథ్, ఏపీ వైపు గుంటూరు ఎస్పీ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

సాగర్ లో 660 మెగా వాట్ల ఉత్పత్తి

నాగార్జునసాగర్ ​పవర్​ప్లాంట్ నుంచి శుక్రవారం జెన్​కో అధికారులు 660 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేశారు. పవర్​ప్లాంట్ 8 యూనిట్ల ద్వారా 810 మెగావాట్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 6 యూనిట్ల ద్వారా 660 మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం 31,675 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. నాగార్జునసాగర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను శుక్రవారం నాటికి 534 అడుగులు, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.5 టీఎంసీలకుగాను ప్రస్తుతం 176.0590 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్​ డ్యాంకు ఎగువనున్న  శ్రీశైలం ప్రాజెక్ట్​ నుంచి 31,600 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా విద్యుత్​ఉత్పాదన ద్వారా 31,675 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

పులిచింతలలో మూడు చెక్​ పోస్టులు

చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు వద్ద మూడు చెక్​పోస్టులు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు దగ్గర పరిస్థితిని శుక్రవారం ఎస్పీ భాస్కరన్ సమీక్షించారు. డ్యాంపై ఇప్పటికే ఏర్పాటు చేసిన మూడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తుండగా, మరికొన్ని కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు మీదుగా ఏపీకి రాకపోకలకు అనుమతి ఇస్తున్నారు. వెహికల్స్​ను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలతో భద్రత కొనసాగుతోంది. మరోవైపు జెన్​కోలో రెండు యూనిట్ల ద్వారా నిరంతరాయంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 24.3 టీఎంసీల నీరు ఉండగా, ఎగువ నుంచి 38 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది.