ప్రైవేట్ ఆస్పత్రుల స్టాఫ్​కు కరోనా టెస్టులు

ప్రైవేట్ ఆస్పత్రుల స్టాఫ్​కు కరోనా టెస్టులు
  • మ్యాక్స్ హెల్త్ కేర్, బీఎల్కే, రేడియంట్ లైఫ్ కేర్ ఆస్పత్రి వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తమ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వేలాది మంది హెల్త్ సిబ్బంది, వర్కర్లకు కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు మ్యాక్స్ హెల్త్ కేర్, బీఎల్కే హాస్పిటల్స్, రేడియంట్ లైఫ్​ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్ మెంట్లు తెలిపాయి. మ్యాక్స్ హెల్త్ కేర్(18,000), బీఎల్కే హాస్పిటల్స్(3,000), ముంబైలోని నానావతి హాస్పిటల్(3,000) పరిధిలోని ఆస్పత్రులలో పనిచేస్తున్నవారికి కొద్ది వారాల్లోనే టెస్టులు నిర్వహిస్తామని ప్రకటించాయి. మ్యాక్స్ హాస్పిటల్​లో ఒక డాక్టర్, నర్సు, నాన్ మెడికల్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిన తర్వాత మేనేజ్​మెంట్ల నుంచి ఈ నిర్ణయం వచ్చింది. మాక్స్ హెల్త్‌కేర్ చైర్మన్ అభయ్ సోయి, రేడియంట్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అభయ్ సోయి, మాక్స్ హెల్త్‌కేర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా.. ఆన్​లైన్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘టెస్టు చేసేందుకు కేటాయించిన సిబ్బందిని కూడా ముందుగా పరీక్షించిన తర్వాత మా ఉద్యోగులందరికీ ఫ్రీగా టెస్టులు నిర్వహిస్తాం. హెల్త్ కేర్ సిబ్బంది సెక్యూరిటీ కోసమే టెస్టులు చేయాలని డిసైడ్ అయ్యాం’’ అని వారు చెప్పారు.
ఆస్పత్రులలో ఇదివరకే ఉన్న రోగులకు, కొత్తగా అడ్మిట్ అవుతున్న పేషెంట్లకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, తర్వాత హెల్త్ సిబ్బందికి, డాక్టర్లకు, నర్సులకు, నాన్ మెడికల్ స్టాఫ్ కు వరుసగా ప్రయారిటీ ఇస్తామని డాక్టర్ బుధిరాజా చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయనున్నట్లు తెలిపారు. మ్యాక్స్ కేర్ కు నార్త్ లో 13 సెంటర్లు, 30 కి పైగా హాస్పిటల్స్ ఉన్నాయన్నారు. ఇందులో ఢిల్లీ ఎన్సీఆర్ లో10 ఉండగా.. మిగతావి మొహాలి, బటిండా, డెహ్రాడూన్​లలో ఉన్నాయని తెలిపారు.