పబ్​జీలో పరిచయం.. లైంగిక వేధింపులు

పబ్​జీలో పరిచయం..  లైంగిక వేధింపులు

అరెస్ట్​ చేసిన సైబర్​ క్రైం పోలీసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ (నాంపల్లి), వెలుగు: పబ్​జీ గేమ్​ ప్రాణాలు తీయడమే కాదు, అమ్మాయిలపై లైంగిక వేధింపులకూ కారణమవుతోంది. అలాంటి ఘటనే హైదరాబాద్​లోని నాంపల్లిలో వెలుగు చూసింది. ఓ అమ్మాయి తల్లిదండ్రులు సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.  కేసు వివరాలను సైబర్​ క్రైం ఏసీపీ ప్రసాద్​ వెల్లడించారు. టోలిచౌకికి చెందిన ఓ బాలిక (14) పబ్​జీ గేమ్​ ఆడుతుండేది. ఆ క్రమంలోనే నాంపల్లికి చెందిన బైక్​ మెకానిక్​ సల్మాన్​ఖాన్​ (22) అనే యువకుడు ఆన్​లైన్​లో ఆమెను ట్రాప్​ చేశాడు. బాలిక నెంబర్​ తీసుకున్నాడు. రోజూ వాట్సాప్​లో చాటింగ్​ చేయడంతో ఇద్దరి మధ్యా చనువు పెరిగింది. ఆ చనువుతోనే అమ్మాయి పర్సనల్​ ఫొటోలను వాట్సాప్​ ద్వారా తీసుకున్నాడు. ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని కోరిక తీర్చాలని, లేకపోతే సోషల్​ మీడియాలో పెడతానని బ్లాక్​మెయిల్​ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు సీసీఎస్​ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫోన్​ నంబర్​ ఆధారంగా సల్మాన్​ను శనివారం అరెస్ట్​ చేశారు.