పంక్చర్ అయ్యిందా.. కాల్ మీ

పంక్చర్ అయ్యిందా.. కాల్ మీ

వాహనచోదకులకు ఒక అటోడ్రైవర్​ వినూత్నమైన సేవలందిస్తున్నారు. కాల్​ మీ అనే పేరుతో ఒక్క ఫోన్​ చేస్తేచాలు వెంటనే అందుబాటులోకి వస్తారు.  ప్రయాణ సమయంలో ఎప్పడైనా ఎక్కడైనా  వాహనం టైర్​ పంక్చర్​అయితే ఒక్క ఫొన్​కాల్​ చేస్తే వచ్చి సేవలందిస్తున్నారు. ఎంతో మంది అవస్థలను ప్రత్యక్షంగా చూసిన ఆటో డ్రైవర్​ యాదయ్య సేవా భావంతో ‘పంక్చర్’ సేవలందించేందుకు ముందుకు వచ్చారు.  సేవ చేసే మనస్తత్వంతో పాటు  బతకడానికి ఉపాధి  పొందుతూ నలుగురికి సహాయపడుతున్నాడు. కొంతకాలంగా తాను నడుపుతూ జీవనం సాగించే ఆటోకు  చిన్న చిన్న మార్పులు చేసి అందులోనే మొబైల్ టైర్ పంక్చర్ ఏర్పాట్లు  చేసుకున్నాడు.ఇ లా తన ఉపాధిని మొబైల్ పంక్చర్ రూపంలో మలుచుకున్నాడు  యాదయ్య. ఎల్ బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్  పరిసర  ప్రాంతాల వారికి పంక్చర్​ సేవలందిస్తున్నాడు. ఎక్కడ పంక్షర్ అయిన సరే ఒక్క కాల్ చేస్తే చాలు నేనున్నానంటూ వచ్చి నిమిషాల్లో పని పూర్తిచేసి ఆదుకుంటున్నాడు.

ట్రాక్టర్​ నుంచి ఆటోకు…

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుణగల్ కు చెందిన కప్పాటి యాదయ్య తన స్వగ్రామంలోనే ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించే వాడు.  కొన్నాళ్ళ తర్వాత  ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 15 ఏండ్ల కిందట  బతుకుదెరువు కోసం  భార్య పిల్లలతో నగరానికి వచ్చాడు. వనస్థలిపురంలో అద్దె ఇంట్లో ఉంటూ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేశాడు.  అందులో కూడా చెయ్యి తిరగక పోవడంతో తెలిసిన వారి సహాయంతో షేరింగ్ ఆటో తీసుకున్నాడు. కొన్నేళ్ల వరకు  బాగానే నడుపుకున్నాడు. రాను రాను పెరిగిన ఆటోల సంఖ్య పెరిగిపోవడంతో గిరాకి లేక  ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఓ రోజు యాదయ్య కిరాయికి పోయి అర్ధ రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో ప్యామిలీతో వస్తున్న ఓ వ్యక్తి స్కూటర్ పంక్చర్ కావడం,  స్కూటర్  నెట్టుకుంటూ వస్తున్న ఆ ఫ్యామిలీని చూసి  యాదయ్య ఆగాడు.

పంక్చర్​ అయిన  స్కూటర్ ను తెలిసిన వారి ఇంటి సమీపంలో పెట్టించి ఆ కుటుంబాన్ని తన ఆటోలో  వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చేశాడు. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న యాదయ్య  ఇలాంటి సమయంలో  ఓ ఆలోచన తట్టింది. డైవింగ్ ఫీల్డ్ కావడంతో పంక్చర్ అయినప్పుడు ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో అనుభవించినవాడు. అలా వచ్చిన ఆలోచనే “మొబైల్ టైర్ పంక్చర్” తన ఇద్దరు స్నేహితుల సహకారంతో ఆటోలో మార్పులు చేర్పులు చేసి పంక్చర్ చేయడానికి కావాల్సిన వస్తువులు ఎయిర్ ట్యాంక్ తో సహ అన్నీ  ఆటోలో ఉండేట్లు ఏర్పాటు చేసుకున్నాడు.

ఇలా మొబైల్ పంక్చర్ ఆటో ద్వారా ఎంతో మందికి తన సేవలను అందిస్తున్నాడు. ఒక్క ఫోన్ కాల్ చేసి హలో యాదన్న ఎడున్నవే అంటే చాలు ఎడికి రావాల్నే అన్నా అంటాడు. క్షణాల్లో అక్కడికి చేరుకుంటాడు. అది బైకైన, కారైన, ఇంకా ఏదైనా లారీ లాంటి పెద్ద వాహనాలైన సరే  పంక్చర్ చేస్తాడు. కామన్ గా తీసుకునే పంక్చర్ రేటుపై తన ఆటో డీజిల్ కూడ కవర్ అయ్యేట్లు మరో రూ.20 మాత్రమే అదనంగా తీసుకుంటాడు. యాదయ్య సేవలు అందుకున్న ప్రతీ ఒక్కరూ శభాష్ అంటూ   అభినందిస్తున్నారు.