ఈడీ ఆఫీసుకు రాహుల్..దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

ఈడీ ఆఫీసుకు రాహుల్..దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈడీ ఆఫీస్ కు ర్యాలీగా  రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాధీ, పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. ఈడీ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో పాదయాత్రగా బయల్దేరి ఈడీ ఆఫీసుకు వెళ్లారు.  రాహుల్ గాంధీ అందరికీ అభివాదం చేస్తూ ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు.

రాహుల్ గాంధీపై కేంద్రం  చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసలకు దిగింది. రాహుల్ కు సంఘీభావంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం, జైరాం రమేష్, సచిన్ పైలట్, ముకుల్ వాస్నిక్, గౌరవ్ గొగోయ్ తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ నాయకుడికి మద్దతుగా నినాదాలు చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లోకి ఎక్కించారు. ఈ మేరకు ఏఐసీసీ ఆఫీస్ ముందు, రాహుల్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈడీ ఆఫీస్ ముందు 144 సెక్షన్ విధించారు. రాహుల్ కు మద్దతుగా ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు వరకు ర్యాలీ వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీలో శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఈ మార్చ్ కు అనుమతి ఇవ్వలేదు. అకారణంగా రాహుల్ ను ఈడీ ముందుకు విచారణకు పిలిపించారని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. దేశంలో జరుగుతున్న దానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.  రాహుల్ గాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా జమ్ము, బెంగళూరులో ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. 

 

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ ను ఈడీ ప్రశ్నించడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, పలువురు సీనియర్ నేతలు ఈడీ ఆఫీసు ముందు నిరసన తెలియజేశారు. తమ నేత రాహుల్ పై అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాహుల్ ఎదుగుదలను చూసి ఓర్వలేక మోడీ సర్కార్ వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా రాహుల్ గాంధీ భయపడరని అన్నారు. బ్రిటీష్ వారిని దేశం నుంచి తరమికొట్టిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ఈడీ ద్వారా వేధింపులకు గురి చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. 

ఇదే కేసులో ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సమన్లు ఇచ్చింది. అయితే ఆమె కరోనా బారినపడ్డారు. కరోనా తదనంతర సమస్యల కారణంగా ఆదివారం దిల్లీలోని సర్‌ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. దాంతో నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఆమె ఈ నెల 23న విచారణకు హాజరుకావాల్సి ఉంది.


నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాలని రాహుల్ గాంధీకి గతంలో నోటీసులు జారీ చేశారు అధికారులు. కాంగ్రెస్ లోని కొంత మంది నేతలతో కలిసి 1938 లో నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ ను స్టార్ట్ చేశారు జవహర్ లాల్ నెహ్రూ. స్వాతంత్రం తర్వాత ఈ న్యూస్ పేపర్ అధికార న్యూస్ పేపర్ గా చెలామణి అయ్యింది. తీవ్రనష్టాలతో 2008 లో నేషనల్ హెరాల్డ్ ను మూసేశారు . తక్కువ మొత్తానికి యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రవేట్ సంస్థకు తక్కువ మొత్తానికి నేషనల్ హెరాల్డ్ పత్రికను కట్టబెట్టారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఫిర్యాదు చేశారు. దాదాపు 2 వేల కోట్ల విలువైన ఆస్తులను రాహుల్ డైరెక్టర్ గా ఉన్న యంగ్ ఇండియాకు కట్టబెట్టారని తెలిపారు. ఈ కేసు విషయమై 2014లో ఈడీ విచారణ చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సాల్ ను ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రశ్నించారు. యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ప్రమోటర్లు అయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది ఈడీ.