చివరి ప్రయత్నంగా రాహుల్​కు సీఎంల రిక్వెస్ట్

చివరి ప్రయత్నంగా రాహుల్​కు సీఎంల రిక్వెస్ట్

కాంగ్రెస్ ప్రెసిడెంట్​పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్​గాంధీ మనసు మార్చేందుకు చివరి ప్రయత్నంగా కాంగ్రెస్​ ముఖ్యమంత్రులు రంగంలోకి దిగారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు సీడబ్ల్యూసీ వారించినా, పార్టీ నేతలు రాజీనామాలు చేసినా రాహుల్​ వెనక్కితగ్గని సంగతి తెలిసిందే. కాంగ్రెస్​ సీఎంలు అశోక్​ గెహ్లాట్​(రాజస్థాన్​), అమరీందర్​ సింగ్​(పంజాబ్​), కమల్​నాథ్​(మధ్యప్రదేశ్​), భూపేష్​ బాగేల్ (ఛత్తీస్​గఢ్​), నారాయణస్వామి(పుదుచ్చేరి) సోమవారం ఢిల్లీలో రాహుల్​ గాంధీతో సమావేశమయ్యారు. హార్ట్​ టు హార్ట్​ అన్నంత క్లోజ్​గా తమతో రాహుల్​ రెండు గంటలపాటు మాట్లాడారని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ కార్యకర్తలు, నేతలు ఏం కోరుకుంటున్నారో వివరించినట్లు అశోక్​ గెహ్లాట్​ మీడియాకు తెలిపారు.  మోడీ సర్కార్​ తప్పుల్ని ఎత్తిచూపడంతోపాటు బీజేపీతో ఐడియాలజికల్​ ఫైట్​​ చేయగల సత్తా ఒక్క రాహుల్​ గాంధీకే ఉందని, ప్రస్తుత పొలిటికల్​ సిట్యువేషన్​లో ఆయన మాత్రమే పార్టీని నడిపించగలరన్న గెహ్లాట్.. ఇదే అభిప్రాయాన్ని రాహుల్​కు కూడా చెప్పామని, ప్రెసిడెంట్​గా కొనసాగాలని రిక్వెస్ట్​ చేశామని వివరించారు. తన రిక్వెస్ట్​ని రాహుల్​ అంగీకరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. గత ఐదేండ్లలో అన్ని రకాలుగా ఫెయిలైన మోడీ.. నేషనలిజం, రిలీజియన్​ పేరుతో ఓట్లు అడిగారని, రాహుల్​ ఒక్కరే రియల్​ ఇష్యూలపై మాట్లాడారని గెహ్లాట్​ గుర్తుచేశారు. రాహుల్​ తప్పుకోవడం ఖాయమని, ఆయన మనసు మార్చేందుకు సీఎంలు చేసిన ప్రయత్నమే చివరిదని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలాఉంటే, కాంగ్రెస్​ పార్టీ, దాని అనుబంధ సంఘాల ఆఫీస్​ బేరర్ల రాజీనామాలు సోమవారం కూడా కొనసాగాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే వందలమంది నేతలు పదవులు వదులుకున్నారు.

ఎదురుదాడి చెయ్యండి: రాహుల్​

జమ్మూకాశ్మీర్​లో పరిస్థితులపై ఆ రాష్ట్ర నేతలతో చీఫ్​ రాహుల్​ మీటింగ్​ నిర్వహించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సమాయత్తంకావాలని, బీజేపీ ఫెయిల్యూర్స్​పై ఎదురుదాడి చేయాలని నేతలకు రాహుల్​ సూచించారు. అమర్​నాథ్​ యాత్ర గురించి ఆయన ఆరాతీశారు. ఢిల్లీలోని రాహుల్​ నివాసంలో జరిగిన సమావేశంలో గులాం నబీ ఆజాద్​, అంబికా సోని, కేసీ వేణుగోపాల్, జమ్మూకాశ్మీర్​ ఇన్​చార్జి షకీల్​ అహ్మద్​, జేకేపీసీసీ చీఫ్​ జీఏ మిర్ పాల్గొన్నారు.