ప్రయాణికులకు రిఫండ్​ ఇవ్వనున్న రైల్వేస్​

ప్రయాణికులకు రిఫండ్​ ఇవ్వనున్న రైల్వేస్​

కరోనా వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్ డౌన్ కారణంగా రైల్వేకు భారీగా ఆర్థిక నష్టం కలుగుతోంది. వేల కోట్ల ఆదాయాన్ని వదులుకోవాల్సి వస్తోంది. ముందస్తు బుకింగ్ కు సంబంధించిన 94 లక్షల టికెట్లకు గాను దాదాపుగా రూ.1,490 కోట్లను రైల్వేస్ రిఫండ్ చేయనుంది. గత నెల 22వ తేదీ నుంచి ఈ నెల 14 వరకు వచ్చిన 55 లక్షల బుకింగ్స్ కు రూ.830 కోట్లు రిఫండ్ చేయనుంది. ఈ నెల15 నుంచి వచ్చే నెల 3 వరకు బుక్ చేసుకున్న 39 లక్షల టికెట్లకు రూ.660 కోట్లను రిఫండ్ చేయనుంది. ప్యాసింజర్ రైలు సర్వీసులు నిలిపివేసిన కాలంలో బుకింగ్స్ చేసుకున్న వారందరికీ డబ్బులు రిఫండ్ చేస్తామని రైల్వేస్ హామీ ఇచ్చింది. రిజర్వేషన్ సెంటర్లలో టికెట్లు బుక్ చేసుకున్న వారు జూలై 31 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చని చెప్పింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అడ్వాన్స్ రిజర్వేషన్, ఈ‌-టికెట్స్  సర్వీసులు అందుబాటులో ఉండబోవని ప్రకటించింది.