రేసులో నిలిచిన రాజస్థాన్.. ధోనీ సేన ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం

రేసులో నిలిచిన రాజస్థాన్.. ధోనీ సేన ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం

7 వికెట్ల తేడాతో చెన్నైపై అలవోక విజయం.. దంచి కొట్టిన బట్లర్

చెలరేగి ఆడి ప్లే ఆఫ్ ​ రేసులో నిలిచిన రాజస్థాన్

ఏడో ఓటమితో ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న చెన్నై

ఇరు జట్లకు చావో రేవోగా మారిన మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ చెలరేగింది..! ప్లే ఆఫ్‌‌ ఆశలు సజీవంగా ఉంచుకుంటూ… పటిష్టమైన చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌కు చెక్‌‌ పెట్టింది..! రాయల్స్‌‌ బౌలర్లు ఇచ్చిన శుభారంభాన్ని వమ్ము చేయకుండా.. బ్యాటింగ్‌‌లో జోస్‌‌ బట్లర్‌‌ (48 బాల్స్‌‌లో 7 ఫోర్లు,
2 సిక్సర్లతో 70 నాటౌట్‌‌) హాఫ్‌‌ సెంచరీతో దుమ్మురేపాడు..! ఫలితంగా చిన్న టార్గెట్‌‌ను అలవోకగా ఛేదించింది..! మరోవైపు చెన్నై స్టార్లందరూ బ్యాటింగ్‌‌లో ఘోరంగా తేలిపోవడంతో ఏడో ఓటమితో ప్లే ఆఫ్‌‌ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది..!!

అబుదాబి: లీగ్‌‌ స్టార్టింగ్‌‌లో తడబాటుకు గురైనా.. కీలక మ్యాచ్‌‌లో సత్తా చాటిన రాజస్తాన్‌‌ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొడుతూ.. సోమవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 7 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 రన్స్‌‌ చేసింది. రవీంద్ర జడేజా (30 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 35 నాటౌట్‌‌) టాప్‌‌ స్కోరర్‌‌. ధోనీ (28 బాల్స్‌‌లో 2 ఫోర్లతో 28) ఫర్వాలేదనిపించాడు. తర్వాత రాజస్తాన్‌‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 రన్స్‌‌ చేసి గెలిచింది. బట్లర్​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

‘టాప్‌‌’ విఫలం..

ఈసారైనా వ్యూహాత్మకంగా ఆడుతుందనుకున్న చెన్నై టాప్‌‌ ఆర్డర్‌‌.. రాజస్తాన్‌‌ బౌలర్ల ముందు తలవంచింది. కరన్‌‌ (22)తో కలిసి ఇన్నింగ్స్‌‌ ప్రారంభించిన డుప్లెసిస్‌‌ (10).. మూడో ఓవర్‌‌లోనే వెనక్కి వచ్చేశాడు.  ఇదే పెద్ద దెబ్బ అనుకుంటే.. తర్వాతి ఓవర్‌‌లోనే వాట్సన్‌‌ (8) వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి టచ్‌‌లోకి వచ్చిన వాట్సన్‌‌.. అదే జోరులో మిడ్‌‌వికెట్‌‌లోకి బాల్‌‌ లేపగా తెవాటియా చేతుల్లోకి వెళ్లింది. ఓ ఎండ్‌‌లో స్థిరంగా ఆడుతున్న కరన్‌‌.. ఐదో ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌ను సిక్సర్‌‌గా మలిస్తే.. రాయుడు (13) రెండు ఫోర్లతో దూకుడుగా మొదలుపెట్టాడు. పవర్‌‌ప్లేలో 43/2 స్కోరు చేసిన చెన్నైకి ఆ తర్వాత ఊహించని షాక్‌‌లు తగిలాయి. ఛేంజ్‌‌ బౌలర్లుగా  వచ్చిన గోపాల్‌‌ (1/14), తెవాటియా (1/18) రన్స్‌‌ కట్టడి చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసి సీఎస్‌‌కే స్కోరుకు కళ్లెం వేశారు. 9వ ఓవర్‌‌లో గోపాల్‌‌.. కరన్‌‌ను, తర్వాతి ఓవర్‌‌లో తెవాటియా.. రాయుడును పెవిలియన్‌‌కు పంపడంతో చెన్నై తొలి 10 ఓవర్లలో 56/4 స్కోరుకే పరిమితమైంది. ఇక ధోనీ, జడేజా ఇన్నింగ్స్‌‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నా.. రాయల్స్‌‌ స్పిన్నర్లు కట్టడి చేశారు. దీంతో సింగిల్స్‌‌, డబుల్స్‌‌కే పరిమితమైన ఈ జంట.. మూడు ఓవర్లలో 15 రన్స్‌‌ మాత్రమే చేసింది. అప్పటికే ఒత్తిడిలో పడిన ఈ జోడీ.. 14వ ఓవర్‌‌లో మూడు ఫోర్లు కొట్టడంతో 14 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌‌లో 4 రన్సే రావడంతో చెన్నై స్కోరు 89/4గా మారింది. స్పిన్నర్ల కోటా పూర్తి కావడంతో ఆర్చర్‌‌, స్టోక్స్‌‌ రెండో స్పెల్‌‌కు వచ్చినా చెన్నై బ్యాటింగ్‌‌లో మార్పు రాలేదు. తర్వాతి రెండు ఓవర్లలో 4, 7 రన్స్‌‌ రాగా, 18వ ఓవర్‌‌లో ఓ ఫోర్‌‌ కొట్టి ధోనీ రనౌటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌‌కు 51 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. లాస్ట్‌‌ రెండు ఓవర్లలో జడేజా రెండు ఫోర్లు కొట్టినా, కేదార్‌‌ (4 నాటౌట్‌‌) సింగిల్స్‌‌కు పరిమితంకావడంతో చెన్నై తక్కువ స్కోరుకే పరిమితమైంది.

బట్లర్‌‌ ధనాధన్​

చిన్న టార్గెట్‌‌ను ఛేదించేందుకు వచ్చిన రాజస్తాన్‌‌కు.. చెన్నై బౌలర్లు చుక్కలు చూపెట్టారు. ముఖ్యంగా దీపక్‌‌ చహర్‌‌ (2/18).. వరుస ఓవర్లలో షాకిచ్చాడు. బౌండ్రీలతో కుదురుకుంటున్న స్టోక్స్‌‌ (19)తో పాటు శాంసన్‌‌ (0)ను ఔట్‌‌ చేశాడు. మధ్యలో హాజిల్‌‌వుడ్‌‌ (1/19) దెబ్బకు ఉతప్ప (4) వికెట్‌‌ పారేసుకోవడంతో రాయల్స్‌‌ 28 రన్స్‌‌కే 3 వికెట్లు చేజార్చుకుంది. స్మిత్‌‌ (26 నాటౌట్‌‌), బట్లర్‌‌ నిదానంగా ఆడటంతో రన్‌‌రేట్‌‌ పడిపోయింది. దీంతో పవర్‌‌ప్లేలో 31 రన్సే వచ్చాయి. ఫీల్డింగ్‌‌ సడలించిన తర్వాత కూడా పేసర్లను కంటిన్యూ చేసిన ధోనీ స్కోరు బోర్డును బాగా కట్టడి చేశాడు. 4 ఓవర్లలో 28 రన్సే రావడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో రాజస్తాన్‌‌ 59/3 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. చేయాల్సిన రన్‌‌రేట్‌‌ పెరగడంతో బట్లర్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించడం మొదలుపెట్టాడు. 12వ ఓవర్‌‌లో వరుసగా 4, 6 బాదడంతో 13 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి రెండు ఓవర్లలో 4, 9 రన్స్‌‌ రాగా, 15వ ఓవర్‌‌లో బట్లర్‌‌ వరుసగా మూడు ఫోర్లతో 16 రన్స్‌‌ పిండుకున్నాడు. ఈ క్రమంలో 37 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ ఫినిష్‌‌ చేశాడు. ఇక గెలవడానికి 30 బాల్స్‌‌లో 18 రన్స్‌‌ కావాల్సిన దశలో స్మిత్‌‌ 4, బట్లర్‌‌ 6తో విజయలాంఛనం పూర్తి చేశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌‌కు 98 రన్స్‌‌ జోడించి టీమ్‌‌ను గెలిపించారు.

చెన్నై.. ఇక అద్భుతం జరిగితేనే

ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు సాధించిన చెన్నై.. నాకౌట్‌ చేరాలంటే అద్భుతం జరగాలి. మిగిలిన నాలుగు మ్యాచ్​ల్లోనూ గెలిస్తే  14 పాయింట్లకు చేరుకుంటుంది. అదే టైమ్‌లో  కేకేఆర్‌, ముంబై, ఆర్‌సీబీ కూడా ఊహించని పరాజయాలను ఎదుర్కోవాలి. అప్పుడు ఈ మూడింటిలో నుంచి ఒక టీమ్‌ వెనక్కి వస్తే.. టెక్నికల్‌గా చెన్నై ముందుకెళ్తుంది. కానీ ఇది దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తున్నది.