డ్రగ్స్​ అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్..300కు పైగా మెఫెన్ టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు స్వాధీనం

డ్రగ్స్​ అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్..300కు పైగా మెఫెన్ టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు స్వాధీనం

గండిపేట, వెలుగు:  సిటీలోని వేర్వేరు చోట్ల డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మైలార్​దేవ్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ ఆఫీసులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. దూల్​పేటకు చెందిన నితీశ్(32) ఓ జిమ్ సెంటర్​లో ట్రైనర్​గా పనిచేస్తున్నాడు. కండలు పెరగాలన్నా, ఎక్కువ సేపు జిమ్ చేయాలన్నా మెఫెన్ టెర్మైన్ సల్ఫేట్ అనే డ్రగ్​ను ఇంజెక్ట్ చేసుకోవాలని చెబుతూ.. తనకు తెలిసిన యువకులకు అమ్మడం మొదలుపెట్టాడు. అయితే, నితీశ్ ఆన్​లైన్​లో ఈ ఇంజక్షన్లను ఆర్డర్ ఇస్తూ కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి తెప్పించుకుంటున్నాడు. 

మెఫెన్ టెర్మైన్ గ్రీన్ రకం ఇంక్షన్లను ఒక్కోటి రూ.284, మెఫెన్ టెర్మైన్ పింక్ రకాలను రూ.330కి ఆన్​లైన్​లో కొని, మంగళ్​హాట్​కు చెందిన బాడీ బిల్డర్ రాహుల్ వద్ద నిల్వ చేసేవాడు. తర్వాత వాటిని రూ.800 నుంచి రూ.1500కు అమ్మేవాడు. డిమాండ్​ను బట్టి పింక్​రకాన్ని రూ.2,500కు కూడా అమ్మేవాడు. ఆదివారం సాయంత్రం ఈ ఇంజక్షన్లను అమ్మేందుకు మైలార్​దేవ్​పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాకు వచ్చిన నితీశ్, రాహుల్​ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మైలార్​దేవ్​పల్లి పోలీసులు అదుపులోకి తీసుకు
న్నారు. వారి నుంచి 126 ఇంజక్షన్లు, వన్ ఎంఎల్ ఇంజక్షన్లు 100, వాటర్ శాంపిల్స్ 50, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. 

వట్టేపల్లిలో మరికొన్ని..

బర్కాస్​కు చెందిన సొహైల్ నదీ(30) అదే ఏరియాలో నదీ ఫిట్ నెస్ సెంటర్ నడుపుతున్నాడు. అతడి ఫ్రెండ్ అహ్మద్ ఖురేషీ ద్వారా ఢిల్లీ నుంచి సిటీకి మెఫెన్ టెర్మైన్ ఇంజక్షన్లను తెప్పించుకునేవాడు. కొందరు యువకుల సాయంతో వాటిని అమ్మేవాడు. ఖురేషిపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. ఆదివారం సాయంత్రం మెఫెన్ టెర్మైన్ ఇంజక్షన్లను వట్టేపల్లి ఏరియాలో డెలివరీ చేయాలని ఖురేషీ తన ఫ్రెండ్ సొహైల్​కు చెప్పాడు.

 సొహైల్ డెలివరీ ఇచ్చేందుకు వట్టేపల్లి రైల్వే ట్రాక్​ వద్దకు వెళ్లాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మైలార్​దేవ్​పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.  61 మెఫెన్ టెర్మైన్ పింక్​ రకం ఇంజక్షన్లు, 101 గ్రీన్ రకం ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.  మెఫెన్​ టెర్మైన్ ​డ్రగ్​ను డాక్టర్ సూచన మేరకు మాత్రమే వాడాలని, బీపీ డౌన్ అయిన వారికి ఎమర్జెన్సీ టైంలో డాక్టర్లు ఇస్తారని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. రెండు చోట్ల పట్టుబడ్డ ముగ్గురు నిందితులను సోమవారం ఉదయం రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.