మొక్కలు చస్తే జీతాల్లోంచి రికవరీ

మొక్కలు చస్తే జీతాల్లోంచి రికవరీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: హరితహారంలో పెట్టిన మొక్కలు చనిపోతే ఆఫీసర్ల జీతాల్లోంచి రికవరీ చేస్తానని కలెక్టర్​ఎంవీ రెడ్డి హెచ్చరించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్​నుంచి మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు. జిల్లాలో1.06 కోట్ల మొక్కలు పెంచటం పట్ల సీఎం కేసీఆర్​ అభినందించటం హర్షనీయమన్నారు. ఇదంతా జిల్లా ఆఫీసర్ల టీం వర్క్​ అని చెప్పారు. మొక్కలు నాటటంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. మొక్కలు చనిపోతే సెక్రటరీ, ఎంపీడీవో, ఎంపీవోలను బాధ్యులు చేస్తామన్నారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్​ చేయాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్​లో వెనుకంజలో ఉన్న ఎంపీడీవో, ఎంపీవోలపై, రైల్వే అండర్​బ్రిడ్జి, డివైడర్లపై పూల మొక్కలు నాటాలని పలుసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్​కమిషనర్​సంపత్​కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రహదారులపై పందులు, పశువులు తిరుగుతున్నాయని, కమిషనర్​కు షోకాజ్​ నోటీస్​ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నాటికి నర్సరీలో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టకపోతే తీవ్ర నిర్లక్ష్యంగా భావించి డ్యూటీ నుంచి సస్పెండ్​ చేస్తానని, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్​ కమిషనర్లను హెచ్చరించారు. నూరు శాతం జియో ట్యాగింగ్​ చేసిన మండలాల ఆఫీసర్లను అభినందించారు. రహదారులకిరువైపులా చెత్త ఉంటే సర్పంచ్​లు, సెక్రటరీలను సస్పెండ్​ చేయడానికి ఫైల్​ తయారు చేయాలని డీపీవోను ఆదేశించారు. వ్యాక్సిన్​ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్​ హెచ్చరించారు. ఈ నెల 16న మొదటి దశలో 8,907 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​ వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.