వరద బాధితులను ఆదుకోవాలి.. సీఎస్​కు కిసాన్ కాంగ్రెస్ సెల్ లీడర్లు, కార్పొరేటర్ల వినతి

వరద బాధితులను ఆదుకోవాలి.. సీఎస్​కు కిసాన్ కాంగ్రెస్ సెల్ లీడర్లు, కార్పొరేటర్ల వినతి

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని కిసాన్ కాంగ్రెస్ సెల్ లీడర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత ఫ్యామిలీలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కోరారు. ఈమేరకు సోమవారం సెక్రటేరియెట్​లో సీఎస్ శాంతి కుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. తర్వాత కిసాన్ కాంగ్రెస్ సెల్ జాతీయ అధ్యక్షుడు సుక్బాల్ సింగ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరద బాధితులను ఆదుకోవాలన్నారు. పశువులు కూడా మృత్యువాత పడ్డాయని, బాధిత రైతులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు. 2024లో కాంగ్రెస్ మేనిఫెస్టో రైతు సంక్షేమమే ఎజెండాగా ఉంటుందని తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మాట్లాడారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి పరిహారం ఇవ్వాలన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. వరి పంటకు ఎకరానికి రూ.20వేలు, పత్తికి రూ.15వేలు, ఇతర పంటలకు ఎకరాకు రూ.10వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక మేటలు వేసిన పంట పొలాలను చదును చేసుకోవడానికి ఎకరానికి రూ.50వేలు ఇవ్వాలన్నారు. ఇక పూర్తిగా నష్టపోయిన ఇండ్లకు రూ.5లక్షలు చొప్పున సాయం అందించాలని కోరారు.