నదులు కలుపుడు ఈజీ కాదు : రాజేంద్రసింగ్‌‌‌‌

నదులు కలుపుడు ఈజీ కాదు : రాజేంద్రసింగ్‌‌‌‌

వాటర్‌‌ మ్యాన్‌‌ ఆఫ్‌‌ ఇండియా రాజేంద్రసింగ్‌‌
గతంలో చేసిన ప్రయత్నాలు సరైన ఫలితాలు ఇవ్వలేదు
భవిష్యత్​లో రాష్ట్రాల మధ్య వివాదాలొస్తాయి..
ఎన్నో సమస్యలు తలెత్తుతాయి
కాళేశ్వరం కింద వరి, చెరుకు పండించకుండా చూడాలి
రివర్స్​ పంపింగ్​తో దుష్పరిణామాలు
అంచనా వేయాలని సూచన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:నదుల అనుసంధానం అంత ఈజీ కాదని, గతంలో జరిగినవి మంచి ఫలితాలను ఇవ్వలేదని వాటర్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా రాజేంద్రసింగ్‌‌‌‌ అన్నారు. సోమవారం వాలంతరీ, ఇన్‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌  ఆఫ్‌‌‌‌  ఇంజనీర్స్‌‌‌‌ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్‌‌‌‌లో నిర్వహించిన సెమినార్‌‌‌‌ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సట్లెజ్‌‌‌‌–యమున నదుల లింక్‌‌‌‌ను 40 ఏళ్ల క్రితమే పూర్తి చేసినా ఇప్పటి వరకూ రాజస్థాన్‌‌‌‌, హర్యానాలకు నీళ్లు రాలేదని.. ఆ రెండు రాష్ట్రాలకు తాము నీళ్లివ్వబోమని పంజాబ్‌‌‌‌ అసెంబ్లీలో తీర్మానమే చేశారని గుర్తు చేశారు. నదుల అనుసంధానం విషయంలో రాజ్యాంగ, శాసన, రాజకీయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రం చేపడుతున్న నదుల అనుసంధానాన్ని ఏ రాష్ట్ర సీఎం కూడా అంగీకరించరని, ఎవరూ తమ వద్ద సర్‌‌‌‌ప్లస్‌‌‌‌ నీళ్లున్నాయని, వాటిని పక్క రాష్ట్రానికి ఇస్తామని చెప్పడం లేదని పేర్కొన్నారు. సభలో పాల్గొన్న తెలంగాణ ఇంజనీర్లు కల్పించుకుంటూ.. ఇక్కడి సీఎం ఏపీకి నీళ్లిస్తానని చెప్తున్నారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు చెప్పొచ్చుగానీ భవిష్యత్‌‌‌‌లో అనేక సమస్యలు తలెత్తుతాయని రాజేంద్రసింగ్‌‌‌‌ వారికి స్పష్టం చేశారు.

ఖర్చుకు తగిన ఫలితం ఉండాలి..

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను మద్దతు తెలపడానికి కొన్ని కారణాలున్నాయని రాజేంద్రసింగ్​ చెప్పారు. మధ్య గోదావరిలో ఎప్పుడో తప్ప వరదలు రావడం లేదని, ఆ ప్రాంతంలో ఉన్న రైతులు సాగులో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరంతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు గోదావరి సజీవంగా మారిందని, అందుకే ప్రాజెక్టుకు మద్దతు తెలిపానన్నారు. అయితే రివర్స్‌‌‌‌ పంపింగ్‌‌‌‌  వల్లే కలిగే మంచితోపాటు పర్యావరణపరమైన దుష్పరిణామాలను అంచనా వేయాలని స్పష్టం చేశారు. భారీ మోటార్ల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి, పంప్‌‌‌‌ చేసే నీటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని..  రైతులు ఎక్కువ నీళ్లు అవసరమైన వరి, చెరుకు పంటలు సాగు చేయకుండా చూడాలని సూచించారు. భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని.. రిజర్వాయర్లు, చెరువుల్లో ఎక్కువగా నీళ్లు నిల్వ ఉండేలా చూడాలని సూచించారు.

కోయ్నా నీటిని కృష్ణాకు మళ్లించాలి

మహారాష్ట్రలోని కోయ్నా ప్రాజెక్టు నుంచి వృథాగా అరేబియా సముద్రంలో కలుస్తున్న 200 టీఎంసీల నీళ్లను కృష్ణా బేసిన్‌‌‌‌కు తరలించి ఉపయోగించుకోవాలని రిటైర్డ్‌‌‌‌ సీఈ పి.వెంకటరామారావు సూచించారు. దాని వల్ల మహారాష్ట్ర కోల్పోయే 1,800 మెగావాట్ల కరెంట్‌‌‌‌ను దిగువ రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణ, ఏపీ  కలిసి ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలని చెప్పారు. కోయ్నా నీటిని ఆల్మట్టికి మళ్లిస్తే అక్కడి నుంచి ఏపీలోని పులిచింతల ప్రాజెక్టు దాకా అన్ని విద్యుత్‌‌‌‌  కేంద్రాల ద్వారా తిరిగి కరెంట్‌‌‌‌  ఉత్పత్తి చేసుకోవచ్చని, నీటిని ఆయకట్టుకు ఉపయోగించుకోచ్చని తెలిపారు.

పశ్చిమ కనుమల నీళ్లు వాడుకోవాలి

గుజరాత్‌‌‌‌  నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమ కనుమల్లో ఏటా బాగా వర్షాలు పడుతున్నా వందల టీఎంసీలు వృథాగా పోతున్నాయని షేత్కారి సంఘటన అధ్యక్షుడు రఘునాథ్‌‌‌‌ దాదాపాటిల్‌‌‌‌ తెలిపారు. ఆ నీళ్లను ఇటు మళ్లించి వాడుకోవాలన్నారు. ఈ నదుల అనుసంధానంపై ఇంజనీర్‌‌‌‌ పాండురంగ తోడ్కర్‌‌‌‌ రూపొందించిన పవర్‌‌‌‌ పాయింట్‌‌‌‌ ప్రజంటేషన్‌‌‌‌ను వివరించారు.

గోదావరికృష్ణాకావేరి లింక్‌‌‌‌పై ప్రజెంటేషన్

తెలంగాణ, ఏపీ సీఎంల భేటీని గోదావరి–కృష్ణా లింక్‌‌‌‌గా చూడొద్దని తెలంగాణ వాటర్‌‌‌‌  రిసోర్సెస్‌‌‌‌  డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌  చైర్మన్‌‌‌‌ వి. ప్రకాశ్‌‌‌‌  చెప్పారు. దేశంలో నదుల అనుసంధానంలో భాగంగానే ఇద్దరు సీఎంలు చర్చలు జరుపుతున్నారన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌‌‌‌సాగర్‌‌‌‌, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులు మిగులు జలాలపై ఆధారపడి కట్టినవని.. ఏపీలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు గోదావరి నీటిని మళ్లిస్తే రెండు రాష్ట్రాలకూ ప్రయోజనమని వివరించారు. కృష్ణాలో పదేళ్లకోసారి తప్ప మిగులు జలాలు ఉంటలేవని, కొన్నిసార్లు నికర జలాలూ రావడం లేదన్నారు. గోదావరి నుంచి వృథాగా పోతున్న నీటిని వాడుకోవాలనే ఈ లింక్‌‌‌‌ ప్రతిపాదన తెస్తున్నారని చెప్పారు. గోదావరి–-కావేరి లింక్‌‌‌‌పై రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌‌‌‌ రెడ్డి పవర్‌‌‌‌  పాయింట్‌‌‌‌ ప్రజంటేషన్‌‌‌‌ ఇచ్చారు.