రోహింగ్యాలతో కొత్త టెన్షన్..కేంద్ర హెచ్చరికలతో రాష్ట్రంలో అలర్ట్

రోహింగ్యాలతో కొత్త టెన్షన్..కేంద్ర హెచ్చరికలతో రాష్ట్రంలో అలర్ట్

హైదరాబాద్, వెలుగు: కరోనాను కట్టడి చేసేందుకు యత్నిస్తున్న పోలీసులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఫారిన్ రిటర్న్స్ తోపాటు నిజాముద్దీన్ మర్కజ్, దేవ్ బంద్ టెన్షన్ మరువక ముందే రోహింగ్యాల రూపంలో వారికి కొత్త టెన్షన్ మొదలైంది. తబ్లిగి జమాత్, హరియాణ మేవాట్ లో జరిగిన మత ప్రచారాల్లో రోహింగ్యాలు పాల్గొన్నారనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సమాచారంతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోహింగ్యాల క్యాంపుల్లో శనివారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు జరిపారు. చాంద్రాయాణ​గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్, బాలాపూర్ ఏరియాల్లో నివసిస్తున్న రోహింగ్యాల వివరాలు రికార్డ్ చేస్తున్నారు. బాలాపూర్ మండల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నర్సింగ్ రావుతోపాటు ఇన్ స్పెక్టర్ భాస్కర్ రోహింగ్యాల డేటా కలెక్ట్ చేశారు. ఇక్కడి 30 క్యాంపుల్లో ఒక్కోదాంట్లో 20 నుంచి 30 వరకు బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్ నుంచి వలస వచ్చిన కుటుంబాలు ఉంటున్నాయి. ఆయా క్యాంపుల పెద్దలను పిలిపించి అక్కడ ఉంటున్న కుటుంబాల వివరాలను సేకరించారు. ఫిబ్రవరి, మార్చి 1వ తేదీ తరువాత ఢిల్లీ, హరియాణ, యూపీతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వారి వివరాలు ఆరా తీశారు. అక్కడున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అనారోగ్యంతో బాధపడుతున్న వారి పేర్లను నమోదు చేశారు. దీంతో పాటు మర్కజ్ తబ్లిగి జమాత్ కి వెళ్ళిన వారి డేటాను కలెక్ట్ చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ క్యాంపు నుంచి వెళ్ళిన వారిలో 8 మంది, నల్లగొండ, జగిత్యాల క్యాంపుల నుంచి రోహింగ్యాలు మర్కజ్, మేవాట్ వెళ్ళినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వాళ్ళు ఇంకా తిరిగిరాకపోవడంతో ఎక్కడికి వెళ్ళారనే వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలకోసం మరోసారి తనిఖీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.