అడవుల్లో అగ్గి ఆర్పేందుకు శాటిలైట్​ సాయం

అడవుల్లో అగ్గి ఆర్పేందుకు శాటిలైట్​ సాయం
  • 1106 ఫైర్ ​జోన్ల గుర్తింపు 
  • మంటలు రేగితే సెల్​ఫోన్లకు అలర్ట్​ మెసేజ్​​
  • క్విక్​ రెస్పాన్స్​ టీంల ఏర్పాటు

నిర్మల్, వెలుగు: ఇటీవలి కాలంలో అడవుల్లో తరచూ మంటలు లేచి విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతోంది. ప్రమాదాల కారణంగా వన్యప్రాణులు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి. ఎండలు ముదురుతుండడంతో మున్ముందు మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అడవుల్లో అగ్ని  ప్రమాదాల నివారణకు అటవీ శాఖ యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఇందుకోసం ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు శాటిలైట్ సహకారం తీసుకుంటున్నారు. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే నివేదిక ఆధారంగా ఉమ్మడి వరంగల్ తోపాటు ఆదిలాబాద్, మహబూబ్ నగర్,  ఖమ్మం జిల్లాలతో పాటు కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ జోన్లలో ఎక్కువ అగ్నిప్రమాదాలు జరిగే  అవకాశాలున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లోని 43 ఫారెస్ట్​రేంజ్​ల పరిధిలో ఉన్న 1,106 ప్రాంతాలను ఫైర్​జోన్లుగా గుర్తించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి మే వరకు అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాల నివారణపై సంబంధిత ఫారెస్ట్​ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. అడవుల్లోకి  పశువుల కాపర్లు అగ్గిపెట్టెలు, బీడీలు, సిగరెట్లు తీసుకువెళ్లకుండా చర్యలు చేపడుతున్నారు. దీంతోపాటు అడవులకు ఆనుకొని ఉన్న పంట పొలాలను రైతులు దహనం చేయకుండా చూస్తున్నారు. అలాగే తునికాకు సేకరణ కోసం అడవుల్లోకి వచ్చే కూలీలపై కూడా దృష్టి పెడుతున్నారు. అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల్లో  ఫారెస్ట్​ ఆఫీసర్లు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రమాదాల నివారణకు స్థానికులు సహకరించాలంటూ కోరుతున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లంతా అడవుల్లో స్పెషల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. క్విక్  రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయడమే కాకుండా డీఎఫ్ఓ ఆఫీస్​లలో  కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేశారు. 

శాటిలైట్ సహకారంతో..

అగ్ని ప్రమాదాల సమాచారంతోపాటు నివారణ చర్యల కోసం ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​శాటిలైట్ సహకారం తీసుకుంటోంది. అన్ని డివిజన్లలోని ఫారెస్టు సిబ్బంది సెల్ ఫోన్లను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్​కు  లింక్​చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. ఈ యాప్ ప్రతి ఫారెస్ట్ ​సిబ్బంది సెల్ ఫోన్​లో   రిజిస్టర్ అయి ఉంటుంది. అడవుల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ఆ సమాచారాన్ని శాటిలైట్ సిగ్నల్  అటవీ సిబ్బంది సెల్ ఫోన్లకు మెసేజ్ పంపిస్తుంది. లొకేషన్​తో సహా వివరాలను అందిస్తుంది. దీంతో ఫారెస్ట్​ సిబ్బంది అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటారు. 

ఇన్​ఫార్మర్లకు రివార్డులు

అడవుల్లో అగ్ని ప్రమాదాల సమాచారాన్ని అందించే ఇన్​ఫార్మర్లకు సీక్రెట్ సర్వీస్ ఫండ్ ద్వారా నగదు రివార్డులను అందించనున్నారు. ఇప్పటికే చెట్ల నరికివేత, కలప స్మగ్లింగ్ సమాచారం తెలుసుకునేందుకు  అటవీశాఖ కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఇన్ఫార్మర్లను నియమించింది. వీరిని ప్రస్తుతం అగ్ని ప్రమాదాల  సమాచారం కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు.

ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నం

అడవుల్లో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు సరిహద్దు జిల్లాల ఫారెస్ట్ ఆఫీసర్లతో కోఆర్డినేషన్ చేస్తూ సమాచారం  ఇచ్చిపుచ్చుకుంటున్నాం. అటవీ డివిజన్ పరిధితో సంబంధం లేకుండా సమీప అడవిలో  అగ్నిప్రమాదం జరిగితే అందరం బాధ్యత తీసుకుంటున్నాం. స్పెషల్ పెట్రోలింగ్​లు చేపడుతున్నాం. క్విక్ రెస్పాన్స్  టీమ్ లను ఏర్పాటు చేసి డివిజన్ ఆఫీసులో కంట్రోల్  రూమ్ రెడీ చేశాం. సమాచారం అందగానే క్విక్ రెస్పాన్స్  టీమ్​లు అక్కడికి  చేరుకుని అగ్ని నిరోధక చర్యలను చేపడతాయి. అలాగే అడవులకు సమీపంలో ఉన్న గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి వారి సహకారాన్ని  తీసుకుంటున్నాం. అడవుల్లోకి  అగ్గిపెట్టెలు, అగ్ని  ప్రమాదాలకు అవకాశం ఉండే ఎలాంటి వస్తువులనూ తీసుకెళ్లకుండా నిషేధించాం.

- వికాస్ మీనా, డీఎఫ్ఓ, నిర్మల్