రాష్ట్రంలో బొగ్గు కొరత లేదు

రాష్ట్రంలో బొగ్గు కొరత లేదు

హైదరాబాద్‌‌/మందమర్రి, వెలుగు: రాష్ట్రంలోని థర్మల్‌‌ విద్యుత్‌‌ కేంద్రాల్లో బొగ్గు కొరత లేదని,  విద్యుత్‌‌ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేదని సింగరేణి ప్రకటించింది. సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల ప్లాంట్‌‌లకు  అవసరమైన మేరకు బొగ్గు సరఫరా చేసేందుకు  చర్యలు తీసుకున్నామని సంస్థ డైరెక్టర్లు వెల్లడించారు.  రాష్ట్రంలోని అన్ని జనరేటింగ్‌‌ స్టేషన్లలో కనీసం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు.  సోమవారం హైదరాబాద్‌‌ సింగరేణి భవన్‌‌ లో డైరెక్టర్‌‌ ఆపరేషన్స్‌‌  ఎస్‌‌.చంద్రశేఖర్‌‌ ,  డైరెక్టర్‌‌ ఫైనాన్స్‌‌ ఎన్‌‌.బలరామ్‌‌లు బొగ్గు ఉత్పత్తి, రవాణాపై అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా రివ్యూ చేశారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అక్టోబరు నెలలో  రోజూ 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని, కనీసం 34 రేక్‌‌లకు తగ్గకుండా రవాణా చేయాలన్నారు. కొత్తగూడెం ఏరియా నుంచి ప్రతీ రోజూ 7 రేక్‌‌లు, ఇల్లందు నుంచి 5 రేక్‌‌లు, మణుగూరు 5, ఆర్జీ-1 నుంచి 1 రేక్‌‌, ఆర్జీ-2 ఏరియా నుంచి 7 రేక్‌‌లు, బెల్లంపల్లి నుంచి 1 రేక్‌‌, మందమర్రి నుంచి 3 రేక్‌‌లు, శ్రీరాంపూర్‌‌ నుంచి 5 రేక్‌‌ల చొప్పున బొగ్గు రవాణా జరిగేలా  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  సింగరేణి తో ఒప్పందం చేసుకున్న థర్మల్‌‌ స్టేషన్లు టీఎస్‌‌ జెన్‌‌కో (తెలంగాణ), ముద్దనూరు ఏపీ జెన్కో, పర్లీ మహా జెన్కో (మహారాష్ట్ర), రాయచూర్‌‌ కెపిసీఎల్‌‌ (కర్ణాటక), మెట్టూర్‌‌ టాన్‌‌ జెడ్కో (తమిళనాడు), రామగుండం ఎన్టీపీసీకి, సింగరేణి థర్మల్‌‌ ప్లాంట్‌‌తో పాటు బ్రిడ్జ్‌‌ లింకేజీ కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌ లోని వీటీపీఎస్‌‌, మహారాష్ట్ర లోని కొరడి, షోలాపూర్‌‌ ఎన్‌‌టీపీసీ, కర్ణాటకలోని ఎరమరాస్‌‌ తదితర విద్యుత్‌‌ కేంద్రాల అవసరాల మేరకు బొగ్గు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి రోజూ ఉత్పత్తి చేసే బొగ్గు లో 86 శాతం అంటే1.5 లక్షల టన్నులను  థర్మల్‌‌ కేంద్రాలకే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో సమీక్షలో ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్‌‌ (కోల్‌‌ మూమెంట్‌‌) జె.ఆల్విన్‌‌, జీఎం (కో ఆర్డినేషన్‌‌)  కె.సూర్యనారాయణ, జీఎం (మార్కెటింగ్‌‌)  కె.రవిశంకర్‌‌ తో  అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.