తల్లిదండ్రుల  కష్టాలే నా రచనలకు ప్రేరణ

తల్లిదండ్రుల  కష్టాలే నా రచనలకు ప్రేరణ

తల్లిదండ్రులు పడిన  కష్టాలే ఆయన రచనలకు ప్రేరణగా నిలిచాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడంతో పాటు తనకు ఇష్టమైన రచనా రంగంలో అత్యున్నతమైన కేంద్ర సాహిత్య అవార్డును అందుకునే స్థాయికి తీసుకెళ్లింది. తుగుళ్ల గోపాల్ కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపిక కావడంపై తోటి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన యువ కవి తగుళ్ల గోపాల్ కు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం లంభించింది. ఈయన కవితా సంకలనం దండకడియం సాహిత్య అకాడమీ యువ పురస్కార్ కు ఎంపికైంది. దండకడియం కవితా సంకలనంలో కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించారు గోపాల్.ఇది జ్యూరీ సభ్యులను ఆకట్టుకోవడంతో అవార్డుకు ఎంపికైంది. కవితా సంపుటాలు, నవలలు, జీవిత కథలు, స్వీయ చరిత్రలు, నాటకాలు, విమర్శలు, ప్రబంధ కావ్యాలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రకటించింది. వివిధ భాషల్లో ప్రచురించిన ఉత్తమ రచనలకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాలు దక్కాయి.  


గోపాల్  తండ్రి గొర్రెల కాపారి, తల్లి వ్యవసాయ కూలీ. ఉన్నంతలో తమ పిల్లలను చదివించారు. తల్లిదండ్రులు ఎల్లమ్మ క్రిష్ణయ్య తమకోసం పడ్డ కష్టం, కుటుంబ పరిస్థితులు గోపాల్ లో ప్రేరణగా నిలిచాయి. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడు. అంతటితో ఆగక తనకిష్టమైన సాహిత్య రచనలు చేస్తూ మూడు పదుల వయసులో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు సొంతం చేసుకున్నారు గోపాల్. 

గోపాల్ బాల్యమంతా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మాడ్గుల మండలం కలకొండలో సాగింది. 7 వ తరగతి వరకు అక్కడే విద్యాబ్యాసం సాగింది. 8వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు నాగార్జున సాగర్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకున్నారు. ఇంటర్ కల్వకుర్తి లో పూర్తి చేసిన గోపాల్  టీటీసీ పూర్తి చేసి 2012 లో ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. కల్వకుర్తిలో గోపాల్ సాహిత్య ప్రస్థానం మొదలైంది. ఇంటర్ స్థాయిలోనే కవిత్వాలు రాయటం అభిరుచిగా మలుచుకున్నారు.. ప్రాస కవిత్వం రాయటం ప్రారంభించాడు. గురువు రాజవర్దన్ రెడ్డి ప్రేరణతో రచనలు చేశారు. తీరొక పువ్వు, దండకడియం ఈయనకు బాగా  పేరు తెచ్చాయి. పాలమూరు సాహితీ అవార్డ్ , తెలంగాణ సారస్వత పరిషత్ అవార్డులు గోపాల్ గెలుచుకున్నారు. గోపాల్ కు యువపురస్కారం లభించటంపై కుటుంబసభ్యులు, తోటి ఉపాధ్యాయుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లా కవులు, రచయితలు గోపాల్ ను అభినందనలతో  ముంచెత్తారు.