మరో 9.5 ఎకరాల వేలానికి రాష్ట్ర సర్కార్ సిద్ధం

మరో 9.5 ఎకరాల వేలానికి రాష్ట్ర సర్కార్ సిద్ధం
  • మరో 9.5 ఎకరాల అర్రాస్​
  • తుర్కయంజాల్‌‌‌‌‌‌‌‌లో 34 ప్లాట్లకు షెడ్యూల్
  • రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు షురూ
  •  వచ్చే నెల 30న ఈ – వేలం

హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ పరిధిలో మరో 9.5 ఎకరాల వేలానికి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. నాగార్జునసాగర్ హైవేలో ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లో తుర్కయంజాల్ పరిధిలోని 34 ప్రైమ్ ప్లాట్స్ వేలానికి షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు ఈ నెల 31 నుంచి జూన్ 27 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1,180గా నిర్ణయించింది. బ్యాంకు లోన్‌‌‌‌‌‌‌‌కు అర్హులైన వ్యక్తులు/సంస్థలు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) కింద ఒక్కో ప్లాట్‌‌‌‌‌‌‌‌కు రూ.5 లక్షల చొప్పున జూన్ 28లోపు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 4, 16 తేదీల్లో సైట్ దగ్గర ప్రీబిడ్ సమావేశం, జూన్ 30న రెండు సెషన్లలో ఈ–వేలం నిర్వహించనున్నారు. ప్లాట్ల వేలం ద్వారా కనీసం రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల మేర ఆదాయం రాబట్టాలని సర్కార్ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

గజానికి మినిమం రేట్ రూ.40 వేలు

కమర్షియల్ కాంప్లెక్స్​లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ నిర్మాణానికి అనుకూలంగా ఉండే ఈ ప్లాట్లు ఒక్కోటి 600 గజాల నుంచి 1,060 గజాల వరకు ఉన్నాయి. 600 నుంచి 700 గజాల మధ్య 14 ప్లాట్లు, 701 నుంచి 800 గజాల మధ్య 10, 800–850 గజాల మధ్య 5, 900 నుంచి 1,060 గజాల మధ్య 5 ప్లాట్లు ఉన్నాయి. గజానికి మినిమం రేటు రూ.40 వేలుగా నిర్ణయించారు. వేలంలో పాల్గొనే వ్యక్తులు ఒక్కోసారి కనీసం రూ.500 పెంచుతూ వేలంలో పాల్గొనాల్సి ఉంటుందని రూల్​ పెట్టారు. రోడ్లు, డ్రైనేజీ, కరెంట్, స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ ట్యాంకు, నల్లా పైపులైన్ మొదలైన మౌలిక సదుపాయాలను ఏడాదిన్నరలో పూర్తి చేసి ఇస్తామని ప్రకటించారు. ఆసక్తి ఉన్న వారు www.auctions.hmda.gov.in,  www.mstcecommerce.com రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.