29వసారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన కామి

29వసారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన కామి

ఖాఠ్మాండు: నేపాల్ కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కామి రీటా షెర్పా 29వసారి ఎవరెస్ట్  పర్వతంపై కాలుమోపాడు. ఎవరెస్ట్ ను అధిరోహించడంలో తన రికార్డును తానే అధిగమించుకున్నాడు. 54 ఏండ్ల కామి రీటా ఆదివారం ఉదయం 7.26 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఎవరెస్ట్ పై కాలు మోపాడని టూరిజం డిపార్ట్ మెంట్  డైరెక్టర్  రాకేష్​ గురుంగ్   తెలిపారు. ‘సెవెన్  సమ్మిట్ ట్రక్స్’ ప్రైవేట్  లిమిటెడ్  ఈ సాహసయాత్ర నిర్వహించింది.

మొత్తం 20 మంది పర్వతారోహకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. వారు ఆదివారం ఉదయం ఎవరెస్ట్ ను అధిరోహించారు. అమెరికా, కెనడా, కజకిస్తాన్, నేపాల్ కు చెందిన క్లైంబర్లు ఈ సాహసయాత్రలో పాల్గొన్నారు. కామి 1994లో మొదటిసారి ఎవరెస్ట్  ఎక్కాడు. నిరుడు ఇదే సీజన్ లో 27, 28వ సారి కూడా ఎవరెస్ట్ ను ఆయన అధిరోహించాడు. తాజాగా మరోసారి ఎవరెస్ట్ పై కాలుమోపి 29 సార్లు ఈ పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.