మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంగళవారం ( డిసెంబర్ 23) మహబూబ్ నగర్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఇంటితోపాటు కుటుంబ సభ్యులు, అనుచరుల ఇండ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తోపాటు మొత్తం 11 చోట్ల సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కూడబెట్టినట్లు గుర్తించారు. అవినీతి, అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించారని ఆరోపణలతో కిషన్ నాయక్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హైదరాబాద్, మహబూబ్ నగర్ లోని కిషన్ నాయక్ ఇండ్లతో అతని బంధువుల ఇండ్లతో కూడా సోదాలు చేశారు ఏసీబీ అధికారులు.ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో 100కోట్లకు పైగా అక్రమఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. నిజామాబాద్ లో 3వేల చదరపు గజాల రాయల్ ఓక్ ఫర్నీచర్ స్పేస్, నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, నిజామాబాద్ లోని అశోక్ టౌన్ షిప్ లో 2 ఫ్లాట్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో31 ఎకరాల వ్యవసాయ భూమి, నిజాంపేటలో 4వేల చ. అడుగుల పాలిహౌస్, షెడ్ వంటి స్థిరాస్తులను గుర్తించారు.
తనిఖీల్లో 1కిలో 4 గ్రాముల బంగారం, మొత్తం 12.72 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు , హోండాసిటీ కారు, ఇన్నోవా క్రిష్టా కారు ను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు.
