టిఫ్ఫా స్కానింగ్లో బేబీకి హార్ట్ ప్రాబ్లం అని తెలిసింది.. డాక్టర్ల సూచన మేరకు అబార్షన్ కోసం వెళితే..

టిఫ్ఫా స్కానింగ్లో బేబీకి హార్ట్ ప్రాబ్లం అని తెలిసింది.. డాక్టర్ల సూచన మేరకు అబార్షన్  కోసం వెళితే..
  • హాస్పిటల్ ముందు డెడ్ బాడీతో నిరసన

సిద్దిపేట రూరల్, వెలుగు: శిశువు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో డాక్టర్ల సూచన మేరకు అబార్షన్  కోసం వెళ్లిన గర్భిణి చనిపోగా, కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన అశ్విని(26) రెండోసారి గర్భం దాల్చింది. సిద్దిపేట పట్టణంలోని శివాజీ నగర్ లో ఉన్న ఓ హాస్పిటల్ లో డాక్టర్ ను సంప్రదించగా, టిఫ్ఫా స్కానింగ్  తీసిన డాక్టర్లు బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు. అబార్షన్ చేయించుకోవాలని సూచించారు.

వారి సూచన మేరకు శుక్రవారం హాస్పిటల్లో జాయిన్  అయిన అశ్వినికి అర్ధరాత్రి అబార్షన్ చేసి బేబీని తొలగించారు. కొద్ది సేపటి తరువాత బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని హడావుడి చేసి, వేరే హాస్పిటల్ కు షిఫ్ట్  చేశారని బంధువులు తెలిపారు. శనివారం అశ్విని పరిస్థితి సీరియస్ గా ఉందని హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారని, అక్కడికి తీసుకెళ్లగా అశ్విని చనిపోయిందని వాపోయారు. డాక్టర్లు సరైన వైద్యం అందించకపోవడంతోనే అశ్విని చనిపోయిందని, తమకు న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్​ చేశారు. హాస్పిటల్  యాజమాన్యం ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.