హైదరాబాద్ నగరం నుంచి విమాన ప్రయాణం ఇప్పుడు దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే భారంగా మారింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం దేశంలోనే అత్యధిక 'యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు' వసూలు చేస్తున్న విమానాశ్రయంగా రికార్డు సృష్టించింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో సమర్పించిన లెక్కల ప్రకారం ఇతర ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్టులతో పోలిస్తే హైదరాబాద్ ప్రయాణికులు తమ టికెట్ ధరలో అధిక మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ ఛార్జీలుగా చెల్లిస్తున్నారు.
హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం దేశీయ ప్రయాణాల కోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ.750, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.15వందలు చొప్పున యూడీఎఫ్ వసూలు చేస్తున్నారు. ఇతర నగరాలతో పోల్చి చూస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరులో దేశీయ ప్రయాణాలకు రూ.550 వసూలు చేస్తుండగా.. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ఈ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో దేశీయ ప్రయాణికులు కేవలం రూ.129 మాత్రమే చెల్లిస్తున్నారు. ముంబైలో ఇది ఒక్కో ప్రయాణికుడికి రూ.175 మాత్రమే ఉంది. అంటే ముంబై, ఢిల్లీ ప్రయాణికుల కంటే హైదరాబాద్ వాసులు దాదాపు ఐదు రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నారన్నమాట.
గత 4 ఏళ్లలో హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే వారు సుమారు రూ.2వేల 500 కోట్లను కేవలం ఈ యూడీఎఫ్ రూపంలోనే చెల్లించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.80 కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు.. 2024-25 నాటికి ఏకంగా రూ.వెయ్యి కోట్లకు పెరిగాయి. విమాన ప్రయాణికుల రద్దీ పెరగడంతో పాటు.. ప్రభుత్వం టారిఫ్ నిబంధనలను సవరించడం దీనికి ప్రధాన కారణం. కరోనా మహమ్మారి తర్వాత ఈ భారం మరింత పెరిగింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో 2020లో రూ.281గా ఉన్న దేశీయ యూడీఎఫ్ ఏకంగా రూ.750కి, అంతర్జాతీయ ఫీజు రూ.393 నుంచి ఏకంగా రూ.15 వందలకు పెరగడం ప్రయాణికులకు పెద్ద భారంగా మారింది.
విమానాశ్రయ నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, నిర్వహణ సంస్థలకు తగిన రాబడిని అందించే ఉద్దేశంతో 'ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ' ఈ ధరలను నిర్ణయిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు లాంటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఆర్థిక స్థితిగతులను సమతుల్యం చేయడానికి ఈ అధిక ఛార్జీలను విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నుంచి విమానం ఎక్కడం అనేది సామాన్యుడి జేబుకు పెద్ద ఖర్చుగా మారటం చర్చనీయాంశంగా మారింది.
