హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకెళ్లే ఔటర్ రింగ్ రోడ్డుపై.. ఏకంగా ఒక 11 ఏళ్ల మైనర్ బాలుడు లగ్జరీ కారు స్టీరింగ్ పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్రనగర్ పోలీసులు రంగంలోకి దిగారు.
స్పీడ్ లిమిట్ ఎక్కువగా ఉండే ఓఆర్ఆర్‌పై ఓ లగ్జరీ కారు అత్యంత వేగంగా దూసుకెళ్లింది. తీరా అందులో డ్రైవింగ్ సీట్లో ఉన్నది ఎవరో చూసి వాహనదారులు విస్తుపోయారు. కనీసం గేర్లు మార్చడానికి, బ్రేకులు వేయడానికి కూడా కాళ్లు అందని ఒక 11 ఏళ్ల చిన్నారి.. ఆ లగ్జరీ కారును నడుపుతూ కనిపించాడు. ఈ ప్రమాదకర డ్రైవింగ్ వీడియోవైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన రాజేంద్రనగర్ పోలీసులు.. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ లగ్జరీ కారు ఓనర్, బాలుడి తండ్రి టోలిచౌకీకి చెందిన అబ్దుల్ హాదీగా గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మైనర్ బాలుడి చేతికి కారు ఇచ్చి, తన ప్రాణాలకే కాకుండా ఓఆర్ఆర్‌పై వెళ్లే వందలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు గానూ.. అబ్దుల్ హాదీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆ లగ్జరీ కారును సీజ్ చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యతని, జైలు శిక్ష తప్పదని పోలీసులు మరోసారి కఠినంగా హెచ్చరిస్తున్నారు.
