ఐటీ స్టాక్స్ ఢమాల్: ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలతో పాటు టెక్ కంపెనీలకు గడ్డుకాలం మొదలైందా..?

ఐటీ స్టాక్స్ ఢమాల్: ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలతో పాటు టెక్ కంపెనీలకు గడ్డుకాలం మొదలైందా..?

నిన్నటి వరకూ ఏఐ టెన్షన్లు భారత ఐటీ రంగాన్ని వెంటాడటంతో అమ్మకాల జోరును చూశాయి. ఇన్వెస్టర్లు సైతం టెక్ రంగంలోని కంపెనీల ఆదాయాలపై ఆందోళనలతో వాటికి దూరంగా జరిగారు. అయితే ఎంత ఏఐ వచ్చినా వాటిని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లగలం అనే ధీమా సాంప్రదాయ భారతీయ ఐటీ కంపెనీల టాప్ మేనేజ్మెంట్ల నుంచి రావటంతో పరిస్థితులు కొంత స్థిమిత పడినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. 

అమెరికా స్టాక్ మార్కెట్‌లో ఐటీ దిగ్గజం 'యాక్సెంచర్' షేర్లు ఒక్కసారిగా కుప్పకూలడం.. భారతీయ ఐటీ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఖర్చులు, కొత్త ప్రాజెక్టుల పునరుద్ధరణ చాలా నెమ్మదిగా సాగుతుందనే ఆందోళనలను ఈ పరిణామం మరోసారి నిజం చేసింది. గ్లోబల్ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించుకోవడమే కాకుండా, గల్ఫ్ దేశాల్లో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల వల్ల ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అమెరికా మార్కెట్లో యాక్సెంచర్ షేర్లు రాత్రికి రాత్రే దాదాపు 18 శాతం మేర కుప్పకూలటం ఇన్వెస్టర్లను భారీ షాక్‌కు గురిచేశాయి.

ఈ ప్రభావం అమెరికా మార్కెట్లలో ట్రేడవుతున్న భారతీయ ఐటీ కంపెనీల ఏడీఆర్‌ల(యూఎస్ డిపాజిటరీ రిసీట్స్)పై స్పష్టంగా కనిపించింది. ఇన్ఫోసిస్ ఏడీఆర్ ఏకంగా 9.7 శాతం పడిపోగా, విప్రో ఏడీఆర్ 3.6 శాతం క్షీణించింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఈ పరిణామాల వల్ల శుక్రవారం ట్రేడింగ్‌లో భారతీయ ఐటీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిని కనిపించింది. అయితే దేశీయ మార్కెట్లలోని మిగిలిన రంగాలు బలంగానే ఉన్నప్పటికీ.. ఐటీ రంగానికి సంబంధించిన షేర్లు మాత్రం ఊహలకు అందనంత నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగించటం మార్కెట్లను షేక్ చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి అవలంబిస్తుందనే ఆందోళనలు ఉన్నప్పటికీ భారత మార్కెట్లు నిలదొక్కుకున్నాయి.

ALSO READ : కుప్పకూలిన గోల్డ్ అండ్ సిల్వర్.. 

యాక్సెంచర్ తన మూడో త్రైమాసికంలో దాదాపు లక్షా 56వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంది. అలాగే కంపెనీ షేరు రాబడి కూడా అంచనాలను మించిపోయింది. అయినప్పటికీ భవిష్యత్తులో డిమాండ్ చాలా బలహీనంగా ఉండబోతోందనే సంకేతాలు, యుద్ధం వల్ల అంతరాయాలు మార్కెట్ వర్గాలను భయపెట్టాయి. కంపెనీకి వచ్చే కొత్త బుకింగ్స్ కూడా గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే దాదాపు లక్షా 64వేల కోట్ల రూపాయల నుంచి లక్షా 61వేల కోట్ల రూపాయలకు పడిపోయాయి. గ్లోబల్ ఐటీ రంగంలో వృద్ధి మందగించిందనే విషయానికి ఇదే సాక్ష్యం. దీని ప్రభావం భారతీయ టెక్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోల త్రైమాసిక ఫలితాలపై ఉండొచ్చనే ఆందోళనలు దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లను ఇప్పుడు భయపెడుతున్నాయి.