దేశంలో నిషేదిత హెచ్ టీ కాటన్ విత్తనం , గ్లైఫోసేట్ రసాయనాలు మార్కెట్లోకి ఎలా వస్తున్నాయని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక రైతులను మోసం చేసి విత్తన కంపెనీలు, డీలర్లు అమ్ముతున్న విషయం కమిషన్ దృష్టికి వచ్చినట్లు వ్యవసాయ అధికారులకు తెలిపారు. బీఆర్కే భవన్ లోని రైతు కమిషన్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కమిషన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, కెవిఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, భూమి సునీల్, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
గ్లైఫోసేట్ గడ్డి మందు చల్లడం వల్ల పంట పొలాలు దెబ్బతింటాయి, లేని పోనీ రోగాలు వస్తాయన్నారు. కుటుంబ కలహాలతో కొందరు రైతులు ఆవేశంలో గ్లైఫోసేట్ గడ్డిమందు తాగి చనిపోయిన సందర్భాలు కూడా వున్నాయి. దేశంలో వీటిపై నిషేధం విధించినా ఏవిధంగా మార్కెట్లోకి వస్తున్నాయని చైర్మన్ కోదండరెడ్డి అధికారులను ప్రశ్నించారు.
ఐతే హెచ్టి కాటన్, గ్లైఫోసేట్ పురుగు మందు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తున్నట్లు అధికారులు కమిషన్ దృష్టికి తెచ్చారు. నారాయణపేట జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న హెచ్ టీ కాటన్ విత్తనాలు 96 క్వింటాళ్లు.. ఈమధ్య తనిఖీల్లో దొరికిన విషయాన్ని కూడా వివరించారు. కేసులు పెట్టిన కూడా మార్పు రావడం లేదని చెప్పడంతో.. కమిషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. నిషేదిత హెచ్టి కాటన్, గ్లైఫోసేట్ వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని, పర్యావరణ పరిరక్షణ చట్టాలను కూడా వినియోగించాలని సూచించింది. అంతేకాదు సీజన్ కు ముందు రైతులకు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని కమిషన్ స్పష్టం చేసింది.
