గ్రామాల్లో వర్షం పడితే చాలు బెకబెక మంటూ కప్పల అరుపులు వినిపించడం సహజం. కానీ వాన కోసం నెలల తరబడి భూమిలో దాక్కుని.. తొలి వర్షాలతో ఒక్కసారిగా బయటకు వచ్చే ఓ ప్రత్యేక కప్ప జాతి తెలంగాణ అడవుల్లో కనిపిస్తోంది. వేసవంతా భూమిలో నిశ్చలంగా గడిపే ఈ చిన్న జీవి.. వర్షాలు ప్రారంభమైన వెంటనే తన జీవిత చక్రాన్ని మళ్లీ ప్రారంభిస్తుంది. ప్రకృతి శాస్త్రవేత్తలకే కాదు, వన్యప్రాణి ప్రేమికులకు కూడా ఆసక్తి కలిగిస్తున్న ఈ అరుదైన కప్పల గురించి ప్రత్యేక కథనం.
చినుకులు పడుతున్న వేళ తెలంగాణ అడవుల్లోని భూమి లోపల, చెట్ల తొర్రల్లో, చెక్ డ్యామ్ల రాళ్ల మధ్య దాగి ఉన్న రహస్య జీవులైన భారతీయ రంగుల కప్పలు (ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్) బయటకొస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లోని కందకాలు, సెలయేర్లు, సరస్సులు, చెక్ డ్యామ్ల దగ్గర బయటపడిన రంగుల కప్పలు రాత్రి కాగానే బెక బెకమంటూ శబ్దాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి పగటిపూట మట్టిలో లేదా చెట్ల తొర్రల్లో దాక్కుంటాయి. భారీ వర్షాల తర్వాత బయటకు వచ్చి ఆహారం కోసం అరుస్తుంటాయి. ఇవి ఎక్కువగా చీమలు, చెదపురుగులను తింటాయి.
ఎక్కడ ఉన్నాయంటే...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవాల్ టైగర్ రిజర్వ్ అడవుల్లో 2024వ సంవత్సరంలో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ కనిపించినట్లు నివేదికలు వచ్చాయి. మెదక్ జిల్లాలోనూ మరోసారి ఈ జాతి కప్పలు కనిపించాయి.
నారింజ రంగు మచ్చల కప్పలు..
ఆకర్షణీయమైన నారింజ రంగు మచ్చల నమూనాలతో ఉన్న ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ తెలంగాణలో అంతుచిక్కని, సున్నితమైన ఉభయచరాల్లో ఒకటి. ఈ కప్పలు వర్షాలతో బయటకు వచ్చాయి. ఈ కప్పలు గుండ్రంగా, బొద్దుగా శరీర రూపురేఖలుంటాయి. వీటి వీపు భాగం ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండి, అంచుల వెంబడి ప్రకాశవంతమైన లేత రంగు నారింజ చారలు ఉంటాయి. వర్షాకాలం ముగియగానే వర్షాలతో పాటే అదృశ్యమవుతుంటాయి.
వర్షాకాలం రాక..
తెలంగాణలో తొలి వర్షాలు కురవడంతో అడవులు, చెరువులు, గుంటలు, వ్యవసాయ పొలాల పరిసరాల్లో రంగుల జాతికి చెందిన కప్పలు పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నాయి. వర్షపు నీటితో తడిసిన నేల, పెరిగిన తేమ ఈ కప్పల సంచారానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది. సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో ఈ కప్పలు చేసే బెకబెక శబ్దాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి.
నిపుణుల ప్రకారం, వర్షాకాలమే వీటి సంతానోత్పత్తి కాలం కావడంతో జతకట్టేందుకు, గుడ్లు పెట్టేందుకు ఇవి నీటి వనరుల దగ్గరకు చేరుకుంటాయి. పర్యావరణ సమతుల్యతలోనూ ఈ కప్పలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పంటలకు హాని చేసే దోమలు, పురుగులను ఆహారంగా తీసుకోవడం ద్వారా రైతులకు పరోక్షంగా మేలు చేస్తాయి. అందువల్ల కప్పలను సంరక్షించడం జీవ వైవిధ్య పరిరక్షణలో ముఖ్యమైన అంశమని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. వర్షాకాలంలో కనిపించే రంగుల జాతి కప్పలు ప్రకృతి ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. వీటి సంఖ్య పెరగడం స్థానిక పర్యావరణ వ్యవస్థ సక్రమంగా ఉందనడానికి ఒక మంచి సంకేతమని నిపుణులు చెప్తున్నారు.
గ్రామాల్లో కప్పతల్లి పూజలు
ఎల్ నినో నేపథ్యంలో తెలంగాణ గ్రామాల్లో కప్పతల్లి ఆటలు సాగుతున్నాయి. వర్షాల రాక కోసం రైతులు ప్రత్యేకమైన సాంప్రదాయక పూజనే కప్పతల్లి ఆట లేదా కప్పల కావిడి అంటారు. వర్షాలు పడక కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు, వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ వినూత్న నమ్మకంతో కూడిన వేడుకను నిర్వహిస్తారు. ఊరిలోని పిల్లలు, యువకులు చెరువులు లేదా బావుల దగ్గరకు వెళ్లి పెద్ద కప్పలను పట్టుకుంటారు. ఒక రోకలికి లేదా కర్రకు పచ్చటి వేప కొమ్మలను కడతారు. ఆ కొమ్మల మధ్యలో పట్టుకున్న కప్పను ఉంచుతారు.
ఈ కావిడిని భుజాలపై వేసుకుని ఊరిలోని ప్రతి ఇంటి ముందుకు తిరుగుతారు. డప్పు చప్పుళ్లతో, పాటలు పాడుతూ కప్పను ఊరేగిస్తారు. కప్పతల్లి కావిడి ప్రతి ఇంటి ముందుకు వచ్చినప్పుడు, ఆ ఇంటి మహిళలు కప్పలపై నీళ్లు చల్లుతారు. ఆ తర్వాత పసుపు, కుంకుమలతో పూజ చేసి, బియ్యం లేదా డబ్బులను కానుకగా ఇస్తారు. కప్పలు అరిస్తే వర్షం పడుతుందనే సహజ సూత్రాన్ని నమ్ముతూ ఈ పూజ చేయడం వల్ల కప్పలు సంతోషించి అరుస్తాయని, తద్వారా వరుణ దేవుడు కరుణించి వెంటనే వర్షాలు కురిపిస్తాడని గ్రామీణుల గట్టి నమ్మకం.వర్షం మనుషులకే కాదు.. ప్రకృతిలోని ఎన్నో జీవులకు కొత్త జీవాన్ని ఇస్తుంది.
నెలల తరబడి భూమిలో దాగి ఉన్న ఈ చిన్న కప్పలు... వర్షాల రాకతో మళ్లీ ప్రకృతి వేదికపైకి వస్తాయి. చిన్న జీవులే అయినా పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ఇవి పోషించే పాత్ర ఎంతో గొప్పది. అందుకే వీటి ఆవాసాలను పరిరక్షించడం, వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కూడా అంతే అవసరం.
కప్పల సంతానోత్పత్తి
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న తొలి భారీ వర్షాలతో అడవుల్లోని వాగులు, లోతైన అటవీ కందకాలు నీటితో నిండిపోవడంతో కప్పలకు సంతానోత్పత్తికి కేంద్రాలుగా మారుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో రుతుపవనాల సమయంలో ఈ చిన్న ఉభయచరాలైన రంగుల కప్పలు సంతానోత్పత్తి చేస్తున్నాయి. కప్ప గుడ్లు టాడ్‌పోల్స్‌గా, టాడ్‌పోల్స్ కప్పపిల్లలుగా, చాలా తక్కువ సమయంలోనే ఒక కొత్త తరం కప్పలు ఉద్భవిస్తున్నాయని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హెడ్ నేచురలిస్ట్ అఖిల్ మైలవరపు చెప్పారు. ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ (భారతీయ రంగుల కప్ప) తెలంగాణ అడవుల్లోని నిశ్శబ్ద రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయిందని హెడ్ నేచురలిస్ట్ అఖిల్ మైలవరపు చెప్పారు. ఈ కప్పలు వర్షాలతో పాటు కనిపిస్తూ, ఆకులు, రాళ్ల మధ్య నివసిస్తూ, రుతుపవనాలు తగ్గుముఖం పట్టగానే తిరిగి ప్రకృతిలో కలిసిపోతున్నాయని తన పరిశీలనలో తేలిందని ఆయన పేర్కొన్నారు.
