ఫ్లీ ఫెస్టివల్స్ @ నైట్

ఫ్లీ ఫెస్టివల్స్ @ నైట్

హైదరాబాద్​లో ఇప్పుడు షాపింగ్, స్ట్రీట్ ఫుడ్, లైవ్ మ్యూజిక్, కళలు, వినోదాన్ని ఒకే వేదికపై అందిస్తున్న నైట్ బజార్లు, ఫ్లీ ఫెస్టివల్స్ నగరవాసులకు కొత్త ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా వీకెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ ప్రదేశాలు యూత్​, ఫ్యామిలీస్​, టూరిస్ట్​లతో కళకళలాడుతున్నాయి. 

ఈ నైట్ బజార్లలో చేతితో తయారుచేసిన ఆభరణాలు, గృహాలంకరణ, ఫ్యాషన్, కళాత్మక ఉత్పత్తులు రంగురంగుల స్టాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా ఉంటున్నాయి. రంగురంగుల లైట్లు, సంగీత స్వరాల మధ్య నైట్ బజార్లలో అడుగుపెడితే ఒక చిన్న ఉత్సవంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఒకవైపు బ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇండిపెండెంట్ సింగర్​లు లైవ్ షోలు ఇస్తుంటే, మరోవైపు ఫుడ్ స్టాల్స్ నుంచి వస్తున్న సువాసనలు విజిటర్స్​ను ఆకర్షిస్తాయి. ‘‘శిల్పారామం మా ఇంటిల్లిపాదికి నైట్ షాపింగ్ స్పాట్’’అని సిటీకి చెందిన ఆర్ సతీష్ చెప్పారు.

సిటీలో ఫ్లీ ఫెస్టివల్స్, నైట్ మార్కెట్​లు, ఈవెంట్​లు ఎక్కువగా పీపుల్స్ ప్లాజాలోని నెక్లెస్ రోడ్డు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, మాదాపూర్​లోని శిల్పారామం, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో జరుగుతుంటాయి. ఈ ఫెస్టివల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రంగురంగుల స్టాల్స్, లైవ్ మ్యూజిక్, స్ట్రీట్ ఫుడ్, హ్యాండీ క్రాఫ్ట్స్ ప్రదర్శనలు ఉంటాయి. పీపుల్స్ ప్లాజాలోని నెక్లెస్ రోడ్డు పెద్ద నైట్ ఫ్లీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ముఖ్యంగా వీకెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి11 గంటల వరకు వివిధ రకాల ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటారు. మాదాపూర్ శిల్పారామం ఆర్ట్, క్రాఫ్ట్స్, ఫ్లీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పెట్టింది పేరు.

ఇక్కడ పండుగలు లేదా ప్రత్యేక సీజన్లలో సాయంత్రం వేళల్లో నైట్ బజార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్​లో సంక్రాంతి వంటి పెద్ద పండుగల్లో రాత్రి 9 గంటల వరకు అంతర్జాతీయ స్థాయి ఫెస్టివల్స్ కైట్, స్వీట్ ఫెస్టివల్స్ జరుగుతాయి. మహీంద్రా యూనిటీ వన్, హైటెక్ సిటీ ఓపెన్ గ్రౌండ్స్, ఐటీ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగుల కోసం రాత్రిపూట ప్రత్యేకంగా వీకెండ్ ఫ్లీ మార్కెట్​లు తరచుగా ఏర్పాటు చేస్తుంటారు.

చిన్న వ్యాపారులకు పెద్ద వేదిక

ఈ నైట్ బజార్ల ప్రత్యేకత ఏమిటంటే స్థానిక పారిశ్రామికవేత్తలకు, హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రోన్ బ్రాండ్లకు, చేతివృత్తుల కళాకారులకు ప్రాధాన్యం లభిస్తుంది. చేతితో తయారుచేసిన ఆభరణాలు, హోమ్ డెకర్ వస్తువులు, హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేడ్ సబ్బులు, కాండిల్స్, దుస్తులు, పెయింటింగ్స్, టెర్రకోట ఉత్పత్తులు, క్రాఫ్ట్ వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పెద్ద షోరూమ్ అవసరం లేకుండా కస్టమర్లను నేరుగా కలిసే అవకాశాన్ని ఈ వేదికలు కల్పిస్తున్నాయి.

సోషల్ మీడియా ప్రభావం

సోషల్ మీడియా పోస్టులే ఈ ఈవెంట్లకు పెద్ద ప్రచార వేదికగా మారాయి. ఆకర్షణీయమైన ఫోటో కార్నర్లు, సెల్ఫీ స్పాట్లు, లైవ్ మ్యూజిక్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మరింతమంది వస్తున్నారు. 

సవాళ్లు కూడా ఉన్నాయి..

నైట్ బజార్లలో పార్కింగ్ కొరత, ట్రాఫిక్ రద్దీ, అధిక ధరలు, వేసవిలో ఉక్కపోత వంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. అలాగే పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, భద్రత వంటి అంశాలపై ఫోకస్​ చేస్తే బాగుంటుందని పబ్లిక్​ అభిప్రాయపడుతున్నారు.

ఫుడ్‌కీ ఫుల్ డిమాండ్

పానీపూరీ నుంచి కొరియన్ స్నాక్స్ వరకు, హైదరాబాద్ బిర్యానీ నుంచి అంతర్జాతీయ వంటకాల వరకు అనేక రకాల స్ట్రీట్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. కొత్త రుచులను ఆస్వాదించేందుకు యువత ఆసక్తి చూపుతుండగా, ఫుడ్ బ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లు కూడా ఈ బజార్లను తమ వీడియోలకు వేదికగా మార్చుకుంటున్నారు.

వినోదానికి కొత్త చిరునామా

నైట్ బజార్లు కేవలం కొనుగోలు, అమ్మకాల వేదికలు మాత్రమే కాదు. స్థానిక సంగీతం, జానపద కళలు, స్వతంత్ర కళాకారుల ప్రతిభకు ఇవి ప్రదర్శన వేదికలుగా మారుతున్నాయి. కొన్నిచోట్ల వర్క్‌‌షాపులు, పిల్లల కోసం ప్రత్యేక కార్యకలాపాలు, పెట్- ఫ్రెండ్లీ జోన్‌‌లు కూడా ఏర్పాటు చేయడం వల్ల అన్ని వయసుల వారికి అనువైన వీకెండ్ అనుభవంగా ఇవి నిలుస్తున్నాయి.ఫుడ్, వినోదంతోపాటు షాపింగ్​కు నైట్ బజార్లు అనువుగా మారాయని అంటారు నగర ఐటీ యువత.